కొనసాగుతున్న 'జియో' జోరు, భారీగా పెరిగిన యూజర్లు

14 Jul, 2021 08:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో చందాదారులు చేరికలోనూ ముందు వరుసలో నిలిచింది. ఏప్రిల్‌లో కొత్తగా 47 లక్షల మంది వినియోగదారుల సంపాదించింది. ఇదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్‌ 5.1 లక్షల మంది కస్టమర్లను చేరుకోగా.. వొడాఫోన్‌ ఐడియా (వీఐ) 18 లక్షల మంది, బీఎస్‌ఎన్‌ఎల్‌ 13.05 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) తెలిపింది.

తాజా వినియోగదారులతో కలిపి జియో మొత్తం చందాదారుల సంఖ్య 42.76 కోట్లకు.. భారతీ ఎయిర్‌టెల్‌ కస్టమర్ల సంఖ్య 35.29 కోట్లకు పెరిగాయి. తాజా క్షీణతతో బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల సంఖ్య 11.72 కోట్లకు, వీఐ వినియోగదారుల సంఖ్య 28.19 కోట్లకు తగ్గాయి. అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం వీఐ 10 లక్షల మంది కస్టమర్లను సంపాదించింది. మొత్తంగా ఏప్రిల్‌ చివరి నాటికి దేశంలో టెలికం చందాదారుల సంఖ్య 120.34 కోట్లకు చేరింది. మార్చి నెలతో పోలిస్తే 0.19 శాతం వృద్ధి. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నెలలో కొత్తగా 1.28 లక్షల మంది జియో కస్టమర్లుగా చేరారు. దీంతో కలిపి ఏపీ, టీఎస్‌ సర్కిల్‌లో జియో కస్టమర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరింది.  
 

మరిన్ని వార్తలు