ఇటు గూగుల్‌.. అటు జియో... మధ్యలో 5జీ

20 Jun, 2021 17:57 IST|Sakshi

5జీ సేవలకు సిద్ధంగా ఉన్న జియో

త్వరలో జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ 

ఇండియాలో ఇంటర్నెట్‌ డేటా విప్లవం సృష్టించిన జియో నెట్‌వర్క్‌ మరోసారి అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. 5జీ నెట్‌వర్క్‌కి సంబంధించి పకడ్బంధీగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఆఫర్లు ప్రకటించనుంది. జూన్‌ 24న జరగబోయే సాధారణ వార్షిక సమావేశంలో ఈ ఆఫర్లకు సంబంధించిన కీలక సమాచారం వెలువడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

జియో 5జీ
ఈ ఏడాది ద్వితీయార్థంలో 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్టే 5జీ సర్వీసులతో పాటు 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌ కూడా ఒకే సారి మార్కెట్‌లోకి తేవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. గతంలో జియో నుంచి స్మార్ట్‌ఫోన్లు చాలా వచ్చినా... ఏవీ కూడా గేమ్‌ ఛేంజర్లుగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఈ సారి గేమ్‌ఛేంజ్‌ ప్లాన్‌తోనే వస్తున్నట్టు సమాచారం. 

గూగుల్‌ ఫోన్‌
గతేడాది జియోలో 7.7 శాతం వాటాలను గూగుల్‌  కొనుగోలు చేసింది. దీంతో జియోతో కలిసి 5జీ మార్కెట్‌ను ఏలేందుకు గూగుల్‌ కూడా సిద్ధమవుతోంది. ఈసారి జియో 5జీ బండిల్‌ ఆఫర్లలో నంబర్‌ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థ తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లు ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గూగుల్‌ గతంలో నెక్సస్‌, మోటో జీ, పిక్సెల్‌ మోడళ్లను మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే జియో బండిల్‌ ప్యాకేజీలో ఇవే మోడళ్లు ఉంటాయా ? లేక కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తారా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి. 

జియో ప్రభంజనం
4జీ నెట్‌వర్క్‌లో జియో  ప్రభంజనం సృష్టించింది. అన్‌లిమిటెడ్‌ డేటాను ఉచితంగా అందించి మార్కెట్‌లో పాతుకుపోయింది. పోటీ కంపెనీలకు గడగడలాడించింది. ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌కి సిద్ధం అవుతోంది. దీంతో మరోసారి బంపర్‌ ఆఫర్లు ఉండొచ్చని అంతా ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు