జియో లాభం జూమ్‌

22 Apr, 2023 04:10 IST|Sakshi

క్యూ4లో రూ. 4,984 కోట్లు

న్యూఢిల్లీ: ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ, డిజిటల్‌ సర్వీసుల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం బలపడి రూ. 4,984 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 4,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 25,465 కోట్లను తాకింది.

అంతక్రితం క్యూ4లో రూ. 22,261 కోట్ల ఆదాయం నమోదైంది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 6.7 శాతం మెరుగై రూ. 178.8కు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,124 కోట్లయ్యింది. 2021–22లో రూ. 15,487 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం ఎగసి రూ. 1,15,099 కోట్లకు చేరింది.  క్యూ4లో 2.9 కోట్లమంది జత కలవడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 43.93 కోట్లను తాకింది.

మరిన్ని వార్తలు