Jio: తగ్గేదె లే అంటున్న రిలయన్స్ జియో!

14 Dec, 2021 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. నవంబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో సెకనుకు 24.1 మెగాబిట్ డేటా డౌన్‌లోడ్ వేగంతో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. అలాగే, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగంలో పెరిగినట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే జియో నెట్ వర్క్ సగటు 4జీ డేటా డౌన్ లోడ్ వేగంలో 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే,  వొడాఫోన్ ఐడియా & భారతి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్ వేగం గత నెలతో పోలిస్తే వరుసగా 8.9 శాతం పెరిగి 17 ఎంబిపిఎస్ స్పీడ్, 5.3 శాతం పెరిగి 13.9 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. 

అక్టోబర్ నెలతో పాటు ఓ నెల కూడా 4జీ డేటా అప్ లోడ్ వేగం పరంగా వొడాఫోన్ ఐడియా అగ్ర స్థానాన్ని కొనసాగిస్తుంది. వొడాఫోన్ ఐడియా కంపెనీ నెట్‌వర్క్ 8 ఎంబిపిఎస్ అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం. డౌన్‌లోడ్ వేగం వినియోగదారులు ఇంటర్నెట్ నుంచి కంటెంట్ యాక్సెస్ చేసుకోవడానికి సహాయపడితే, అప్‌లోడ్ వేగం ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వేగంగా పోస్టు చేయడానికి సహాయ పడుతుంది. ఇక, ఎయిర్‌టెల్‌ & రిలయన్స్ జియో నెట్‌వర్క్ అప్‌లోడ్ వేగం అక్టోబర్ నెలలో గత ఐదు నెలలతో పోలిస్తే గరిష్ట స్థాయిలో 5.6 ఎంబిపిఎస్, 7.1 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో భారతదేశం అంతటా సేకరించే డేటా ఆధారంగా ట్రాయ్ నెట్‌వర్క్ సగటు వేగం లెక్కిస్తుంది. 

(చదవండి: అగ్నికి ఆహుతి అయిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏ కంపెనీదో తెలుసా?)

మరిన్ని వార్తలు