జియోమార్ట్‌: వాట్సాప్‌ ద్వారా నిత్యావసర సరుకులు డెలివరీ

16 Dec, 2021 11:28 IST|Sakshi

నిత్యావసరాలు, కూరగాయలు మొదలైన వాటిని వాట్సాప్‌ ద్వారా ఆర్డరు చేస్తే ఇంటి వద్దకే అందించేలా రిటైల్‌ దిగ్గజం జియోమార్ట్‌ కొత్త సర్వీసు ప్రవేశపెడుతోంది. ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా పేరిట మెటా నిర్వహించిన కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్‌ డైరెక్టర్లు ఆకాశ్‌ అంబానీ, ఈషా అంబానీ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. 


‘బ్రెడ్, పండ్లు..కూరగాయలు, శీతలపానీయాలు ఇలా ఏ సరుకులైనా, ఆ రోజుకు కావాల్సినా లేక ఆ వారానికి కావాల్సినవైనా జియోమార్ట్‌కు వాట్సాప్‌ ద్వారా ఆర్డరు చేయొచ్చు. తరచుగా కావాలంటే సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవచ్చు. మీ కొనుగోళ్ల చరిత్రను బట్టి వ్యక్తిగత సిఫార్సులు పొందవచ్చు‘ అని ఈషా అంబానీ పేర్కొన్నారు. ‘వాట్సాప్‌ ద్వారా కొనుగోలు ప్రక్రియ అత్యంత సరళంగా, సులభతరంగా ఉంటుంది‘ అని ఆకాశ్‌ తెలిపారు.

రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఆర్డర్ల డెలివరీ ఉంటుంది. దేశీయంగా రిటైల్‌ వ్యయాల్లో ఆహారం, కిరాణా సరుకుల వాటా భారీగా ఉంటుంది. 2025 నాటికి ఇది 1.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరవచ్చని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా. జియోమార్ట్‌ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 5 లక్షల పైచిలుకు రిటైలర్లు ఉన్నారని, ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆకాష్‌ వివరించారు.  

వాట్సాప్‌తో రీచార్జ్‌ కూడా..     
టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ యూజర్లు సైతం త్వరలో వాట్సాప్‌ ద్వారా రీచార్జి చేయించుకోవచ్చని ఆకాశ్‌ పేర్కొన్నారు. చెల్లింపులతో పాటు మొబైల్‌ రీచార్జింగ్‌లకు కూడా వాట్సాప్‌ ఉపయోగపడనుండటం ఆసక్తికరమని ఆయన తెలిపారు. 2022లో జియో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. రీచార్జింగ్‌ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేస్తుందని, రీచార్జ్‌ వంటి అవసరాల కోసం బైటికి వెళ్లలేని సీనియర్‌ సిటిజన్లులాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈషా అంబానీ తెలిపారు. 2021 సెప్టెంబర్‌ ఆఖరు నాటికి జియోకు 42.95 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు