జేకే టైర్‌- సాగర్‌ సిమెంట్స్‌.. స్పీడ్‌

22 Oct, 2020 12:48 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

9 శాతం దూసుకెళ్లిన జేకే టైర్‌ షేరు

9 శాతం జంప్‌చేసిన సాగర్‌ సిమెంట్స్

‌52 వారాల గరిష్టాన్ని తాకిన షేరు

వరుస లాభాలకు ట్రేడర్లు బ్రేక్‌ వేయడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 212 పాయింట్లు క్షీణించి 40,495ను తాకింది. నిఫ్టీ 60 పాయింట్లు నీరసించి 11,878 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో ఓవైపు జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, మరోపక్క సాగర్‌ సిమెంట్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 105 కోట్లకు పరిమితమైంది. తక్కువ పన్ను వ్యయాల కారణంగా గతేడాది క్యూ2లో అధిక లాభాలు నమోదైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,275 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 367 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో జేకే టైర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 66ను అధిగమించింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 64 వద్ద ట్రేడవుతోంది.  

సాగర్‌ సిమెంట్స్‌ లిమిటెడ్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో సాగర్‌ సిమెంట్స్‌ నికర లాభం 10 రెట్లు ఎగసి రూ. 50 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 23 శాతం పుంజుకుని రూ. 326 కోట్లను తాకింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16 శాతం నుంచి రెట్టింపై 32 శాతాన్ని తాకాయి. క్యూ2లో దాదాపు 21 శాతం మెరుగుపడిన ధరలు(రియలైజేషన్లు) పటిష్ట పనితీరుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సాగర్‌ సిమెంట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 750కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 731 వద్ద ట్రేడవుతోంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా