గ్రిడ్‌ పాలసీతో అదరగొడుతున్న హైదరాబాద్‌

30 Mar, 2022 12:06 IST|Sakshi

ఆఫీస్‌ స్పేస్‌ను క్రియేట్‌ చేయడంలో తెలంగాణ సర్కారు వ్యూహాత్మంగా వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి వంద మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌ కలిగిన నగరంగా నిలుస్తుందంటూ అంచనా వేసింది.

హైదరాబాద్‌ నగరంలో ఐటీ రంగం బలంగా పాతుకుపోవడంతో ఏ గ్రేడ్‌ ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో గణనీయమైన వృద్ధిని హైదరాబాద్‌ కనబరుస్తోంది. ఏ గ్రేడ్‌ ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీల తర్వాత హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతా, చెన్నై, పూనే వంటి నగరాలను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రేడ్‌ ఏ రకం ఆఫీస్‌ స్పేస్‌ 90 మిలియిన్ల చదరపు అడుగులుగా ఉంది. అయితే ఇందులో 96 శాతం ఆఫీస్‌ స్పేస్‌ గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటి వంటి నగరంలోని పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమైంది.

గ్రేడ్‌ ఏ రకం ఆఫీస్‌ స్పేస్‌ అంతా ఒకే దిక్కున ఉండడటంతో అక్కడ ఆఫీస్‌ స్పేస్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు భవిష్యత్తులో పశ్చిమ ప్రాంతాన్ని ట్రాఫిక్‌ చిక్కులు తదితర సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో ఆఫీస్‌ స్పేస్‌ను వికేంద్రీకరించే విషయంగా తెలంగాణ ప్రభుత్వం గ్రోత్‌ ఇన్‌ డిస్‌పెర్షన్‌ (గ్రిడ్‌) పాలసీని అందుబాటులోకి తెచ్చింది. 

గ్రిడ్‌ పాలసీలో భాగంగా హైదరాబాద్‌ నగరంలో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆఫీస్‌ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మాణ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే నగరంలోని తూర్పు ప్రాంతమైన ఉప్పల్‌లో జెన్‌పాక్ట్‌, ఎన్‌ఎస్‌ఎల్‌, రాంకీ ఎస్టేట్స్‌ ఉన్నాయి. కాగా రాబోయే ఐదేళ్లలో ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా మూడు మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌ను వృద్ధి చేస్తామని ప్రకటించాయి. ఇక కొంపల్లి, మేడ్చల్‌ ఏరియాలో ఇటీవల కొత్త ఐటీ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

గ్రేడ్‌ వన్‌ ఆఫీస్‌ స్పేస్‌ విస్తరణకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే 2016 నుంచి 2021 వరకు హైదరాబాద్‌ నగరం 81 శాతం వృద్ధితో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక రాబోయే ఐదేళ్లలోనూ ఇదే జోరు కొనసాగుంది. అయితే కొత్తగా వచ్చే 35 నుంచి 40 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ పశ్చిమను మినహాయించి నగరం నలుమూలలా రానున్నట్టు జేఎల్‌ఎల్‌ పేర్కొంది. గ్రిడ్‌ పాలసీ వల్ల ఇది సాధ్యమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు నలువైపులా సమాన స్థాయిలో అభివృద్ధి, మౌలిక వసతులు నెలకొనే అవకాశం ఉందని జేఎల్‌ఎల్‌ అభిప్రాయపడింది.

చదవండి: కో–వర్కింగ్‌ స్పేస్‌.. అందరి నోటా ఇదే మాటా.. ప్రత్యేకతలు ఇవే

మరిన్ని వార్తలు