Monster: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు

21 Sep, 2021 10:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల కోసం ప్రకటనలు జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో ఒక శాతం పెరిగాయి. మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ‘గతేడాదితో పోలిస్తే క్రితం నెలలో ఉద్యోగ ప్రకటనలు 14 శాతం అధికమయ్యాయి. 

ఆన్‌లైన్‌ నియామకాలు జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో దుస్తులు, వస్త్రాలు, లెదర్, రత్నాలు, ఆభరణాల విభాగంలో 24 శాతం, మార్కెటింగ్, కమ్యూనికేషన్‌ 17, తయారీ 8, చమురు, సహజవాయువు, పెట్రోలియం, విద్యుత్‌ 6, నౌకాశ్రయం, సముద్ర సంబంధ 4, బీపీవో, ఐటీఈఎస్‌ విభాగాల్లో 3 శాతం పెరిగాయి. కస్టమర్‌ సర్వీస్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికం 2 శాతం, ఆతిథ్యం, యాత్రలు 1 శాతం అధికమయ్యాయి. ఆరోగ్యం, ఆర్థిక, అకౌం ట్స్‌ విభాగాల్లో ఎటువంటి వృద్ధి నమోదు కాలేదు. పండుగల సీజన్‌ సమీపిస్తుండడం ప్రకటనలు పెరగడానికి కారణం. వస్త్ర పరిశ్రమకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి కేబినెట్‌ ఆమోదంతో ఈ రంగం మరింతగా వృద్ధి చెందనుంది.  

రాబోయే నెలల్లోనూ.. 
ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఉక్కు రంగాలు 7 శాతం, వ్యవసాయ సంబంధ 6, ఎఫ్‌ఎంసీజీ, ఆహారం, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ 5, రవాణా, కొరియర్‌ 4 శాతం తగ్గాయి. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ నుండి భారత్‌ కోలుకోవడంతో ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉద్యోగ నియామకాలలో సానుకూల, స్థిరమైన వృద్ధి ఉంది. నియామకాల విషయంలో మెట్రో నగరాల్లో మే నెల నుంచి స్థిరమైన పెరుగుదల కొనసాగుతోంది. 

ఇక నగరాల వారీగా చూస్తే నియామకాలు హైదరాబాద్, ముంబై, చెన్నైలో ఒక్కో నగరంలో 3 శాతం, కోయంబత్తూరులో 2 శాతం అధికమయ్యాయి. కొచ్చి, కోల్‌కతా 4 శాతం, చండీగఢ్, జైపూర్‌ 1 శాతం తగ్గాయి’ అని మాన్‌స్టర్‌.కామ్‌ వివరించింది. పండుగల సీజన్‌తోపాటు కాలానుగుణ డిమాండ్‌తో రాబోయే నెలల్లో నియామక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని టాలెంట్‌ అక్విజిషన్‌ అనలిస్ట్‌ రేచల్‌ స్టెల్లా రాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు