Facebook: వీసా లొసుగులతో నాన్‌ లోకల్స్‌కు జాబ్స్‌.. వంద కోట్ల సెటిల్‌మెంట్‌కు ఓకే

20 Oct, 2021 08:51 IST|Sakshi

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ నెత్తిన మరోపిడుగు పడింది.  ఉద్యోగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భారీ పెనాల్టీ విధించింది అమెరికా న్యాయ విభాగం. 14.5 మిలియన్‌ డాలర్లు(మన కరెన్సీలో సుమారు 107 కోట్ల రూపాయల దాకా) పెనాల్టీకి ఆదేశించింది.  ఈ మేరకు ఫేస్‌బుక్‌ ఒక మెట్టు కిందకు దిగి..  ఒప్పందానికి రావడంతో వాదప్రతివాదనలకు ఆస్కారం లేకుండా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. 


ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌ను ఉల్లంఘించిందనే ఆరోపణల ఆధారంగా ఫేస్‌బుక్‌ మీద అమెరికా న్యాయ విభాగం గత డిసెంబర్‌లో ఒక కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు బదులు  తాత్కాలిక ఉద్యోగులకు(విదేశీ ఉద్యోగులు, హెచ్‌ 1-బీ వీసాదారులు తదితరులు) ప్రాధాన్యత ఇవ్వడంలాంటి చర్యలకు పాల్పడింది ఫేస్‌బుక్‌. ఇది ఫెడరల్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌ నిబంధనలకు విరుద్దమేనని లేబర్‌ విభాగం సైతం వాదించింది. ఈ తరుణంలో సెటిల్‌మెంట్‌కు ముందుకొచ్చిన ఫేస్‌బుక్‌.. భారీ పెనాల్టీ చెల్లింపునకు అంగీకరించింది.   

ఇక ఫేస్‌బుక్‌తో జరిగిన ఈ సెటిల్‌మెంట్‌ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అమెరికా అటార్నీ జనరల్‌(సహాయక) క్రిస్టన్‌ క్లార్క్‌ . 35 ఏళ్లలో ఇదే అతిపెద్ద సివిల్‌ రైట్స్‌ విభాగపు సెటిల్‌మెంట్‌గా పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యోగులకు బదులు.. తాత్కాలిక వీసాదారులకు పీఈఆర్‌ఎం కింద (permanent labor certification program) ఫేస్‌బుక్‌ ఉద్యోగాలు ఇవ్వడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సివిల్‌ పెనాల్టీ కింద 4.75 మిలియన్‌ డాలర్లు, ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపించినందుకు మరో 9.5 మిలియన్‌ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకుంది ఫేస్‌బుక్‌.

చదవండి: మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్‌బెర్గ్‌

ఇదీ చదవండి:  జుకర్‌బర్గ్‌ కలత.. రాజీనామా?

మరిన్ని వార్తలు