ఐకానిక్‌ బేబీ పౌడర్‌కు గుడ్‌బై!

12 Aug, 2022 12:07 IST|Sakshi

సాక్షి, ముంబై: జాన్సన్ & జాన్సన్ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది.  పలు వివాదాల నేపథ్యంలో ఇకపై జాన్సన్‌ బేబీ పౌడర్‌ విక్రయాలకు స్వస్తి పలకే ఆలోచనలో ఉంది. వివిధ దేశాల్లో చట్టపరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ బేబీ పౌడర్‌ ఉత్పత్తులను నిలిపివేయాలని  యోచిస్తోంది.  (ఫెస్టివ్‌ సీజన్‌: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా)

కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్
2023 నాటికి  టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ ప్రపంచవ్యాప్తంగా విక్రయాలను నిలిపివేయనున్నట్టు జాన్సన్  అండ్‌ జాన్సన్ ప్రకటించింది. ఈమేరకు హెల్త్‌కేర్ దిగ్గజం ఒక ప్రకటన విడుదల చేసింది.  అమెరికాలో  ఉత్పత్తి విక్రయాలను ముగించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో మదింపులో భాగంగా, కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో విక్రయిస్తున్నామని పేర్కొంది. 

అమెరికా, కెనడాలలో బేబీ పౌడర్‌ అమ్మకాలను 2020లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. జాన్సన్ టాల్కం పౌడర్‌పై వినియోగదారులకు తప్పుడు సమాచారం అందించిందనీ,  ప్రమాదకరమైన, కలుషిత పదార్థాలు ఉన్నాయని పలుపరిశోధనల్లో తేటతెల్లమైంది. దీంతో యూరప్‌లో డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది.

1894 నుండి జాన్సన్ బేబీ పౌడర్ ఐకానిక్‌ సింబల్‌గా మారింది. అయితే ఆ తరువాతికాలంలో జాన్సన్‌ పౌడర్ వల్లనే కేన్సర్‌కు గురైమయ్యామని, బాధితులు, చనిపోయిన వారి బంధువులు కోర్టుకెక్కారు. అలాగే టాల్క్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్ కేన్సర్ కారకం ఉందని దశాబ్దాలుగా కంపెనీకి తెలుసని 2018 రాయిటర్స్ పరిశోధన  వాదించింది.

అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన జాన్సన్‌  అండ్‌ జాన్సన్‌  తమ ఉత్పత్తులు సురక్షితమైనవనీ, అస్బెస్టాస్-రహితమైనవని ఇప్పటికీ వాదిస్తోంది. పలు వినియోగ దారులు, ప్రాణాలతో బయటపడినవారు, బంధువులకు చెందిన సుమారు 38వేల వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పలుకోర్టులు కస్టమర్లకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకుపైగానే పరిహారం అందించింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ అమ్మకాలను నిలిపి వేయాలని కోరుతూ చాలా మంది కోర్టులో దావా వేశారు.  ఈ క‍్రమంలో  టాల్కం పౌడర్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలనే చూస్తోంది.

మరిన్ని వార్తలు