చెల్లింపుల వైఫల్యంలో జేపీ

9 Jan, 2023 08:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్‌ లిమిటెడ్‌(జేఏఎల్‌) రుణ చెల్లింపుల్లో విఫలమైంది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 4,059 కోట్ల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయ్యింది. జేపీ అసోసియేట్స్‌ దాఖలు చేసిన వివరాల ప్రకారం డిసెంబర్‌ 31న రూ. 1,713 కోట్ల అసలు, రూ. 2,346 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. వివిధ బ్యాంకులకు చెందిన రుణాలున్నట్లు పేర్కొంది. 2018 సెప్టెంబర్‌లో జేఏఎల్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఈ అంశం జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇక పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ గతేడాది(2022) సెప్టెంబర్‌లో జేఏఎల్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. సెప్టెంబర్‌ 15కల్లా రూ. 6,893 కోట్లు చెల్లింపుల్లో విఫలమైనట్లు ఫిర్యాదులో ఎస్‌బీఐ పేర్కొంది. కాగా.. 2022 డిసెంబర్‌లో జేఏఎల్‌సహా గ్రూప్‌లోని ఇతర కంపెనీలు మిగిలిన సిమెంట్‌ ఆస్తులను దాల్మియా భారత్‌కు విక్రయిస్తున్నట్లు వెల్లడించాయి. రూ. 5,666 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో డీల్‌ కుదుర్చుకున్నాయి. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. సిమెంట్‌ బిజినెస్‌ నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి.

చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్‌!

మరిన్ని వార్తలు