జేపీ మోర్గాన్‌ లాభం 42% డౌన్‌..

14 Apr, 2022 05:29 IST|Sakshi

రష్యాలో 1.5 బిలియన్‌ డాలర్ల వ్యాపారం రైటాఫ్‌ ..

న్యూయార్క్‌:  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ జేపీ మోర్గాన్‌ చేజ్‌ నికర లాభం 42 శాతం క్షీణించింది. 8.3 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఉక్రెయిన్‌–రష్యా మధ్య ఉద్రిక్తతలు, భారీ ద్రవ్యోల్బణ ప్రభావాలతో దాదాపు 1.5 బిలియన్‌ డాలర్ల రష్యన్‌ అసెట్స్‌ను రైటాఫ్‌ చేయడం ఇందుకు కారణం. గతేడాది తొలి త్రైమాసికంలో జేపీమోర్గాన్‌ చేజ్‌ లాభం 14.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కరోనా వైరస్‌ పరిణామాలతో తలెత్తే మొండి బాకీల ప్రొవిజనింగ్‌ కోసం ముందుజాగ్రత్తగా పక్కన పెట్టిన నిధులను చేజ్‌ క్రమంగా బైటికి తీస్తుండటంతో గతేడాది లాభాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి.

ప్రస్తుతం, అందుకు భిన్నంగా రష్యన్‌ అసెట్స్‌ను రైటాఫ్‌ చేయాల్సి రావడం, బేస్‌ ఎఫెక్ట్‌ వంటి అంశాల కారణంగా బ్యాంక్‌ లాభాలు తగ్గాయి. రైటాఫ్‌ చేసిన నిధులు .. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగం, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాలకు సంబంధించినవని జేపీ మోర్గాన్‌ చేజ్‌ వెల్లడించింది. తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన వాల్‌ స్ట్రీట్‌ దిగ్గజాల్లో మొదటి సంస్థ జేపీ మోర్గాన్‌ చేజ్‌. ఈ సంస్థకు రష్యాలో ఒక మోస్తరు స్థాయిలో వ్యాపారం ఉంది. మరోవైపు, రష్యాలో గణనీయంగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, కన్జూమర్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలున్న సిటీగ్రూప్‌... గురువారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు