భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి

24 Aug, 2022 08:53 IST|Sakshi

భారత్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి క్షీణత

జూలైలో 3.8 శాతం క్షీణత  

న్యూఢిల్లీ: భారత్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి 2022 జూలైలో 3.8 శాతం తగ్గింది. 2021 జూలైలో 2.54 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగితే, తాజా సమీక్షా నెల జూలై ఈ పరిమాణం 2.45 మిలియన్‌ టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ అలాగే ప్రైవేట్‌ రంగ సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి దీనికి ప్రధాన కారణం. దేశ నెలవారీ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి లక్ష్యం 2.59 మిలియన్‌ టన్నులకన్నా తక్కువ ఉత్పత్తి నమెదయినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. పశ్చిమ సముద్ర తీరంలో ఓఎన్‌జీసీ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్‌ టన్నులకు పడిపోయింది.  ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల్లో సైతం ఉత్పత్తి 12.34 శాతం క్షీణించింది. 

వార్షిక అంచనాలు ఇలా... 
ఇక ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య నాలుగు నెలల కాలాన్ని పరిశీలిస్తే (2021-22 ఇదే కాలంతో పోల్చి) క్రూడ్‌ ఉత్పత్తి 9.96 మిలియన్‌ టన్నుల నుంచి స్వల్పంగా 9.91 మిలియన్‌ టన్నులకు తగ్గింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 29.7 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి వరుసగా 39.8 మిలియన్‌ టన్నులు, 34 మిలియన్‌ టన్నులుగా నమోద వుతుందని అంచనావేస్తున్నట్లు చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఇటీవలే పేర్కొన్నారు. దేశం తన మొత్తం క్రూడ్‌ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. మిగిలిన 15 శాతం క్రూడ్‌ను భారత్‌ ఉత్పత్తి  చేస్తుంది. చమురు శుద్ధికి దేశంలో 22 ఆయిల్‌ రిఫైనరీలు ఉన్నాయి.  

అక్కడక్కడే సహజ వాయువు ఉత్పత్తి 
కాగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి జూలైలో దాదాపు అక్కడక్కడే 2.88 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లుగా (బీసీఎం) ఉంది. అయితే నాలుగు నెలల కాలంలో మాత్రం ఉత్పత్తి 3.4 శాతం పెరిగి 11.43 బీసీఎంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముంబై సముద్రతీరంలోని డామన్‌ క్షేత్రంలో తక్కువ గ్యాస్‌ ఉత్పత్తి కారణంగా ఓఎన్‌జీసీ గ్యాస్‌ ఉత్పత్తి జూలైలో దాదాపు 4 శాతం క్షీణించింది.  

మరిన్ని వార్తలు