Apple: తగ్గేదెలే! ఆపిల్‌ ఇండియా దూకుడు

29 Jul, 2022 13:55 IST|Sakshi

న్యూయార్క్: ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇండియా ఆదాయం దాదాపు రెండింత లైంది. జూన్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 83 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.  గతఏడాదితో పోలిస్తే 2శాతం వృద్ధితో రికార్డు  స్థాయిలో 83 బిలియన్ డాలర్ల ఆదాయ సాధించినట్లు ఆపిల్ తెలిపింది.

జూన్ 25తో ముగిసిన 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను ఆపిల్‌ గురువారం వెల్లడించింది. తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని సాధించామని ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడించారు. సరఫరా పరిమితులు, బలమైన విదేశీ మారకపు సవాళ్లు, రష్యా ప్రభావం ఉన్నప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు. అలాగే అమెరికా, యూరప్, మిగిలిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జూన్ త్రైమాసికంలో రికార్డు నెలకొల్పామన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాంలో రెండంకెల వృద్ధిని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో జూన్ త్రైమాసిక ఆదాయ రికార్డు సృష్టించామని తెలిపారు. ఈ క్రమంలో ఇండియాలో దాదాపు రెట్టింపు ఆదాయాన్ని సాధించామని కుక్‌ వెల్లడించారు.

జూన్ త్రైమాసికంలో కంపెనీ సేవల ఆదాయం 19.6 బిలియన్ల డాలర్ల రికార్డు ఆదాయం నమోదు చేశామని యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లూకా మిస్త్రి తెలిపారు. మైక్రో ఎకానమీ కష్టాలు,  రష్యాలో తమ వ్యాపారం  లాంటి ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ 12 శాతం ఎగిసినట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు