VIRAL: విషాద ఘటనపై టీషర్టులు.. ‘దారుణం’ అంటూ ఆగ్రహజ్వాలలు

20 Aug, 2021 14:32 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత.. నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓవైపు తాలిబన్లు భద్రతా హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. అఫ్గన్‌లపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు భయాందోళన నిండిన పౌరులు.. పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారగా.. పసిపిల్లలనైనా రక్షించాలనే తాపత్రయంతో కంచె అవతల ఉన్న విదేశీ సైన్యానికి అందిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా అనిపిస్తున్నాయి.
 

అఫ్గన్‌ పరిస్థితులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓ దుస్తుల కంపెనీ.. అఫ్గన్‌ దుస్థితిని క్యాష్‌ చేసుకోవాలనుకున్న ప్రయత్నాన్ని దారుణంగా తిప్పికొట్టారు కస్టమర్లు. తాలిబన్‌ ఆక్రమణ పూర్తయ్యాక అమెరికా సీ-17 విమానం ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో.. ఇద్దరు వ్యక్తులు గగనతలం నుంచి ఓ బిల్డింగ్‌ మీద పడి ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. అఫ్గన్‌ల భయానికి అద్దంపట్టే ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి.

అయితే ఈ ప్రాణభీతి ఘటనను ఉద్దేశిస్తూ.. కాబూల్‌ స్కై డైవింగ్‌ క్లబ్‌ పేరుతో ఓ దుస్తుల కంపెనీ లేటెస్ట్ మోడల్స్‌ను రిలీజ్‌ చేసింది. ఆకాశంలో విమానం నుంచి కిందపడ్డ పౌరులను ఉద్దేశిస్తూ ఆ టీషర్ట్‌ ఉంది.  Kabul Skydiving Club Est. 2021 పేరుతో లేటెస్ట్‌ మోడల్స్‌ను రిలీజ్‌ చేసింది. కొన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌లు వీటిని అమ్మకానికి ఉంచడం విశేషం. దీంతో ‘సరదానా? శవాలపై వ్యాపారమా?’ అంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే రాజకీయ ఉద్దేశాలు, అఫ్గన్‌ల దీనస్థితిని తెలియజేసేందుకు తాము ఆ టీషర్టులను రూపొందించినట్లు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కానీ, వివరణపై నెటిజన్స్‌ మాత్రం తగ్గట్లేదు. విషాద ఘటన ద్వారా టీషర్టులను అమ్మే ప్రయత్నాన్ని ‘క్రూరం.. ఘోరం’గా అభివర్ణిస్తూ నెటిజన్స్‌ మండిపడుతున్నారు.

చదవండి: మా కంటి పాపలనైనా కాపాడండి

మరిన్ని వార్తలు