జెట్‌ ఎయిర్‌వేస్‌కు రెక్కలు

18 Oct, 2020 05:16 IST|Sakshi

కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇండియా టేకాఫ్‌కు ముందడుగు పడింది. కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ మారనుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అయిన కల్రాక్‌ క్యాపిటల్, వ్యాపారవేత్త మురారీ లాల్‌ జలాన్‌ల కన్సార్షియం జెట్‌ పగ్గాలను చేపట్టబోతోంది. జెట్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకై ఈ కన్సార్షియం ఆఫర్‌ చేసిన బిడ్‌ను జెట్‌ రుణ సంస్థల కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని శనివారం వెల్లడించింది. కల్రాక్‌–జలాన్‌ల కన్సార్షియం బిడ్‌లో భాగంగా బ్యాంకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది.

జెట్‌ను దక్కించుకునే వేటలో ఎఫ్‌ఎస్‌టీసీ, బిగ్‌ చార్టర్, ఇంపీరియల్‌ క్యాపిటల్‌ సైతం పోటీపడ్డాయి. అప్పుల భారంతో నష్టాల్లో కూరుకుపోయి, దివాలా తీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీ అప్పులు రూ.8,000 కోట్లకు ఎగబాకాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలతోసహా రూ.40,000 కోట్ల బకాయిలు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ అయిన ఈ సంస్థలో దాదాపు 22,000 మంది ఉద్యోగులు ఉండేవారు. కోల్‌కతాలో తమ కుటుంబ వ్యాపారమైన పేపర్‌ ట్రేడింగ్‌లో మురారీ లాల్‌ జలాన్‌ తన కెరీర్‌ను 1980లో ప్రారంభించారు. పేపర్‌ తయారీ, రియల్టీ, హెల్త్‌కేర్‌ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి రష్యా, యూఏఈ వంటి దేశాల్లో విస్తరించారు. జెట్‌ డీల్‌తో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది

మరిన్ని వార్తలు