ఫ్లిప్‌కార్ట్‌ డైరెక్టర్ల బోర్డులో మార్పులు

25 Dec, 2020 01:11 IST|Sakshi

సీఈఓ కృష్ణమూర్తికి చోటు 

హెచ్‌డీఎఫ్‌సీ సీఈఓ కేకే మిస్త్రీకి కూడా 

నలుగురు డైరెక్టర్ల తొలగింపు  

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్‌ తన డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించింది. ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి, హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్మన్, సీఈఓ, కేకీ మిస్త్రీలకు డైరెక్టర్ల బోర్డ్‌లో స్థానం కల్పించింది. నలుగురిని డైరెక్టర్ల బోర్డ్‌ నుంచి తప్పించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానుండటంతో ఈ మార్పులు జరిగాయని సమాచారం. డైరెక్టర్ల బోర్డ్‌ పునర్వ్యస్థీకరణను ఫ్లిప్‌కార్ట్‌ ధ్రువీకరించింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కృష్ణమూర్తి డైరెక్టర్ల మార్పులు, చేర్పుల వివరాలను వెల్లడించారు.

నలుగురు డైరెక్టర్లు–రాజేశ్‌ మాగౌ, రోహిత్‌ భగత్, స్టూవార్ట్‌ వాల్టన్, డిర్క్‌వాన్‌ డెన్‌ బెరేలను డైరెక్టర్లుగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీరి స్థానంలో కళ్యాణ్‌ కృష్ణమూర్తి, కేకీ మిస్త్రీలతో పాటు వాల్‌మార్ట్‌ నుంచి సురేశ్‌ కుమార్, లే హాప్కిన్స్‌ను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు వివరించారు.   ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్‌ కంపెనీ 1,600 కోట్ల డాలర్లకు 2018లో కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ సంస్థ 120 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది.

మరిన్ని వార్తలు