ప్రభుత్వ సంస్థ అమ్మకంపై కేంద్రం యూటర్న్‌, ఆర్థికశాఖ సహాయ మంత్రి కీలక ప్రకటన!

30 Mar, 2022 10:45 IST|Sakshi

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ)ని ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కే కరాద్‌ రాజ్యసభలో తెలిపారు. 2021 మార్చి 31వ తేదీ నాటికి ఎల్‌ఐసీ, జీఐసీ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. 38.04 లక్షల కోట్లు, రూ. 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయని కరాద్‌ స్పష్టం చేశారు. 
 
బ్యాంకుల్లో డిపాజిటర్లకు ఎక్కువ రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో డీఐసీజీసీ కింద బ్యాంకులలో డిపాజిటర్లకు బీమా కవర్‌ పరిమితిని ఒక్కో డిపాజిటర్‌కు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి వివరించారు. 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అన్ని ‘బీమా చేయబడిన’ బ్యాంకులు, వాటి డిపాజిటర్లకు ఒకే విధంగా వర్తిస్తుందని ఆయన చెప్పారు. 

‘‘దీనితోపాటు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌– క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (సవరణ) చట్టం, 2021 గత ఏడాది ఆగస్టు 13వ తేదీన రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది. అదే ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్, 1949 ప్రకారం బ్యాంకులపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో డీఐసీజీసీ మధ్యంతర చెల్లింపుల ద్వారా డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ మేరకు డిపాజిటర్లు తమ డిపాజిట్లను సులభంగా, తగిన కాలపరిమితితో పొందేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి’’ అని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. 

మరిన్ని వార్తలు