Karur Vysya Bank Q1 Results: అదరగొట్టిన కరూర్‌ వైశ్యా.. డబులైంది!

26 Jul, 2022 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 229 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) క్యూ1లో కేవలం రూ. 109 కోట్లు ఆర్జించింది. వడ్డీ మార్జిన్లు బలపడటం ఇందుకు దోహదపడింది.

నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 746 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.55 శాతం నుంచి 3.82 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.97 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.69 శాతం నుంచి 1.91 శాతానికి దిగివచ్చాయి. ఈ బాటలో ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 247 కోట్ల నుంచి రూ. 155 కోట్లకు వెనకడుగు వేశాయి. క్యూ1లో ఆభరణ రుణ పోర్ట్‌ఫోలియో 13 శాతం పుంజుకుని రూ. 14,873 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 3 శాతం లాభపడి రూ. 55.35 వద్ద ముగిసింది.

చదవండి: Canara Bank: వావ్‌.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్‌!

మరిన్ని వార్తలు