డిఫాల్టర్‌గా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

25 Nov, 2020 05:01 IST|Sakshi

న్యూఢిల్లీ: క్లయింట్ల సెక్యూరిటీలను సొంతానికి వాడుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) .. డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఎక్స్చేంజీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని పేర్కొంది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఒక సర్క్యులర్‌లో ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. నవంబర్‌ 23 నుంచే దీన్ని అమల్లోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు, కొత్త క్లయింట్లను తీసుకోకుండా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై మధ్యంతర ఉత్తర్వుల్లో విధించిన నిషేధాన్ని ఖరారు చేస్తూ సెబీ మంగళవారం తుది ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సంస్థపైనా, దాని డైరెక్టర్లపైనా తగు చర్యలు తీసుకోవాలంటూ స్టాక్‌ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలకు సూచించింది.

ఇన్వెస్టర్ల క్లెయిమ్‌లను సెటిల్‌ చేసే వరకూ, ఎన్‌ఎస్‌ఈ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా .. కార్వీ తన ఆస్తులను ఎవరికీ బదలాయించకూడదంటూ సెబీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్వెస్టర్ల నిధులు, సెక్యూరిటీలను అనుమతి లేకుండా వాడుకున్న కార్వీ కేసులో.. 2.35 లక్షల మంది ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,300 కోట్లకు విలువైన నిధులు, సెక్యూరిటీలను సెటిల్‌ చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏం జరిగిందంటే.. 
1985లో రిజిస్ట్రీ సర్విసుల సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించిన కార్వీ గ్రూప్‌ ఆ తర్వాత కమోడిటీలు, బీమా, రియల్టి, ఆన్‌లైన్‌ బ్రోకింగ్‌ తదితర విభాగాల్లోకి విస్తరించింది. ఈ క్రమంలో బ్రోకింగ్‌ సంస్థగా క్లయింట్లు ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటారీ్నలను దుర్వినియోగం చేసి, వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి రూ. 2,300 కోట్ల పైగా విలువ చేసే సెక్యూరిటీలను తన డీమ్యాట్‌ ఖాతాల్లోకి అనధికారికంగా మళ్లించుకుందని కార్వీపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ షేర్లను తనఖా పెట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కార్వీ రుణాలు తీసుకుంది. వీటిని కార్వీ రియల్టీ వంటి గ్రూప్‌ కంపెనీలకు మళ్లించింది. ఇదంతా బైటపడటంతో 2019 నవంబర్‌లో కార్వీ కొత్త క్లయింట్లను తీసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఆ తర్వాత డిసెంబర్‌లో కార్వీ ట్రేడింగ్‌ కార్యకలాపాలను స్టాక్‌ ఎక్స్చేంజీలు నిలిపివేశాయి. ఈ స్కామ్‌ దరిమిలా  బ్రోకింగ్‌ సంస్థలకు నిబంధనలను సెబీ మరింత కఠినతరం చేసింది. కార్వీ గ్రూప్‌ తన వ్యాపారాన్ని ఆర్థిక సేవలు, ఆర్థికేతర సేవల కింద రెండు విభాగాలుగా విడగొట్టింది.    

మరిన్ని వార్తలు