త్రివేణీ బైబ్యాక్‌.. కేఈసీ క్యూ1- షేర్లు జూమ్‌

11 Aug, 2020 12:18 IST|Sakshi

క్యూ1 ఫలితాల ప్రభావం

కేఈసీ ఇంటర్నేషనల్‌- 7 శాతం అప్‌

త్రివేణీ ఇంజినీరింగ్‌ 9 శాతం హైజంప్‌

షేరుకి రూ. 105 ధరలో బైబ్యాక్‌కు త్రివేణీ బోర్డు ఓకే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మౌలిక సదుపాయాల కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్‌ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో షుగర్‌ తయారీ కంపెనీ త్రివేణీ ఇంజినీరింగ్‌ సైతం ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. దీంతో ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.  వివరాలు చూద్దాం..

కేఈసీ ఇంటర్నేషనల్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో కేఈసీ ఇంటర్నేషనల్‌ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం తక్కువగా రూ. 2207 కోట్లను తాకింది. కోవిడ్‌-19 కారణంగా పనితీరు ప్రభావితమైనప్పటికీ పూర్తిఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆశిస్తున్నట్లు కేఈసీ యాజమాన్యం పేర్కొంది. ఇబిటా 22 శాతం నీరసించి రూ. 251 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కేఈసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7 శాతం దూసుకెళ్లి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. 

త్రివేణీ ఇంజినీరింగ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో త్రివేణీ ఇంజినీరింగ్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 146 శాతం దూసుకెళ్లి రూ. 84 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 921 కోట్ల నుంచి రూ. 1222 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. ఒక్కో షేరుకీ రూ. 105 ధర మించకుండా 2.5 శాతం వాటాకు సమానమైన 61.9 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు బోర్డు ఓకే చెప్పినట్లు త్రివేణీ వెల్లడించింది. ఇందుకు దాదాపు రూ. 65 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో త్రివేణీ ఇంజినీరింగ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 77.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 82 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు