కోఆపరేటివ్‌ సొసైటీలు: కేరళ వర్సెస్‌ కేంద్రం.. ఆర్బీఐ నుంచి అందుకే ఒత్తిడి?

25 Nov, 2021 15:52 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా RBI మార్గదర్శకాలపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. ప్రైమరీ కో​ఆపరేటివ్‌ సొసైటీలు, కోఆపరేటివ్‌ బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణ ఆదేశాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. 


ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్‌ ప్రకారం.. కోఆపరేటివ్‌ సొసైటీలు ‘కోఆపరేటివ్‌ బ్యాంక్‌’ అనే పదాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఓటింగ్ హక్కు లేని సభ్యుల నుంచి సహకార సంఘాలు డిపాజిట్లు తీసుకోకుండా నిషేధం విధించింది. ఈ మార్గదర్శకాల వల్ల 1,625 ప్రైమరీ కోఆపరేటివ్‌ సొసైటీలు, వేలకొద్దీ ఇతర కోఆపరేటివ్‌ బ్యాంకుల నిర్వహణకు ఆటంకాలు  ఎదురుకానున్నాయి. అందుకే ఆర్బీఐ గైడ్‌లైన్స్‌పై సుప్రీంను ఆశ్రయించాలని కేరళ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ మేరకు కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌, అడ్వొకేట్‌ జనరల్‌తో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు.

  

అయితే ఆర్బీఐ మాత్రం సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ జారీ చేసిన బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెప్తోంది. ఇదిలా ఉంటే ఈ చట్టం కేరళలో మాత్రమే పటిష్టంగా అమలు కావడం లేదని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలోనే కేంద్రం ఆర్బీఐపై ఒత్తిడి చేస్తుండగా.. ఈ రెండు ఆదేశాలపై సుప్రీం కోర్టు ఊరట ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశాలతోనే కేంద్రం ఇలా ప్రవర్తిస్తోందంటూ కేరళ కోఆపరేషన్‌ మినిస్టర్‌ వీఎన్‌ వాసవన్‌ ఆరోపిస్తున్నారు. 60 శాతం కోఆపరేటివ్‌ సొసైటీల కార్యకలాపాలు సజావుగా సాగడం బహుశా కేంద్రానికి కంటగింపుగా మారిందేమోనని ఆయన అంటున్నారు.

క్లిక్‌ చేయండి: ఆ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌బీఐ

మరిన్ని వార్తలు