లిక్విడ్‌ ఫండ్స్‌ రాబడులు తగ్గాయెందుకు?

21 Feb, 2022 09:04 IST|Sakshi

ఇటీవలి కాలంలో లిక్విడ్‌ ఫండ్స్‌ మంచి పనితీరు చూపించడం లేదు ఎందుకని? ఈ కారణంగా స్వల్పకాలం కోసం నా పెట్టుబడులను లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి ఇతర విభాగాలకు బదిలీ చేసుకోవాలా?     – భాస్కర్‌ 
మీ పెట్టుబడులను మరో విభాగానికి తరలించడం ద్వారా అధిక రాబడులు సమకూర్చుకోవడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. తక్కువ రిస్క్, ఊహించిన రాబడులు పొందాలంటే లిక్విడ్‌ ఫండ్స్‌ అనుకూలం. లేదంటే అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం అధిక మెచ్యూరిటీ కాలంతో ఉంటాయి. కనుక కొంత అదనపు రాబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు క్షీణించడమే లిక్విడ్‌ ఫండ్స్‌లో రాబడులు తగ్గడానికి కారణం. ద్రవ్యోల్బణం వచ్చే కొన్ని నెలల్లో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. దాంతో రాబడులు కూడా పెరుగుతాయి. అప్పుడు ఈ ఫండ్స్‌ మంచి పనితీరు చూపిస్తాయి. 91 రోజులకు గడువు తీరే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. స్వల్పకాలానికే గడువు తీరడం వల్ల మళ్లీ పెట్టుబడులకు ఆ నిధి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల కాస్త మెరుగైన రాబడులను ఇవ్వగలవు. 

క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం డెట్‌ ఫండ్స్‌ కంటే హైబ్రిడ్‌ ఫండ్స్‌ మంచి ఎంపిక అవుతుందా? ఎటువంటి హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి? – కృష్ణకుమార్‌ త్రిపాఠి 
ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుని, ఉపసంహరణ 4–6 శాతం మధ్య లేదా 7 శాతం ఉంటుందని అనుకుంటే హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం నయం. ఎందుకంటే అదే డెట్‌ ఫండ్స్‌ అయితే మీరు ఉపసంహరించుకున్నంత మేరే రాబడి కూడా ఉంటుంది. కనుక ద్రవ్యోల్బణం మించి మెరుగైన రాబడులు డెట్‌ ఫండ్స్‌ ఇస్తాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేట్టు అయితే అందుకు హైబ్రిడ్‌ ఫండ్స్‌ అనుకూలం. అప్పుడు ఉపసంహరణ రేటు 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. లేదంటే మీ రిస్క్‌ సామర్థ్యం అనుమతిస్తే ఈక్విటీ ఫథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడే మీరు ఉపసంహరించుకునే మొత్తానికంటే మీ పెట్టుబడి అధికంగా వృద్ధి చెందుతుంటుంది.

క్రమానుగత పెట్టుబడి ఉపసంహరణ కోసం పెద్దగా రిస్క్‌ తీసుకోని ఇన్వెస్టర్లకు హైబ్రిడ్‌ ఫండ్‌ మంచి ఎంపిక అవుతుంది. అలాగే, మంచి హైబ్రిడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం కూడా కీలకం అవుతుంది. కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ లేదా అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ఫండ్‌ లేదా బ్యాలన్స్‌డ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ మధ్య సరైన ఎంకిక కీలకమన్నది మర్చిపోవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ లేదా అగ్రెస్సివ్‌ ఫండ్‌ అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరే ప్రవర్తిస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరతలకు దూరంగా ఉండలేవు. అయినప్పటికీ అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే మరింత నిలకడగా వీటి పనితీరు ఉంటుంది. పెట్టుబడి నుంచి 4–5 శాతం మేర ఉపసంహరించుకోవాలంటే అగ్రెస్సివ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అంతకుమించి వెనక్కి తీసుకోవాలంటే అప్పుడు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌కు వెళ్లాలి.

అంతకంటే మరింతగా 6.5–7 శాతం మేర వెనక్కి తీసుకోవాలంటే కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌కు వెళ్లాలి. ఎందుకంటే అస్థిరతలు ఎక్కువగా ఉండే (అధిక ఈక్విటీ కేటాయింపులు) చోటు నుంచి ఎక్కువ మొత్తంలో వెనక్కి తీసుకునేట్టు అయితే.. మార్కెట్ల పతనాల సమయంలో పెట్టుబడి తగ్గిపోతుంటుంది. అందుకనే ఉపసంహరణ రేటు ఎక్కువగా ఉంటే కన్జర్వేటివ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం సరైనది. ఇక పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ పడుతుంది. అందుకని ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనంలో పెట్టుకోవాలి. మిగిలిన మొత్తాన్ని హైబ్రిడ్‌ లేదా ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఏడాది తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని మొదలు పెట్టుకోవాలి.   
 
- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)
 

మరిన్ని వార్తలు