బంగారం .. సొంత ఇల్లు.. జాగా.. పన్ను రాయితీలు ఇలా..

7 Mar, 2022 12:48 IST|Sakshi

చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు .. అయ్యా సేవింగ్స్‌ బోలెడంత ఉన్నాయి .. అబ్బాయి అమెరికా నుండి పంపారు. అక్కడ సంవత్సరానికి రూపాయి కూడా వడ్డీ రాదు. ఇండియాలో ఎక్కువ ఆదాయం వస్తుంది .. మమ్మల్ని ఎందులో ఇన్వెస్ట్‌ చేయమంటారు .. ఎంతవరకు చెయ్యాలి అని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో .. ఈ వారం ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌‘లో కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.  

ఎంత ఇన్వెస్ట్‌ చేయవచ్చన్న ప్రశ్నకు మీ దగ్గర ఉన్న .. లేదా చేసిన సేవింగ్స్‌ను ఎలా పొదుపు చేశారన్న దానిపై మీరు వివరణ ఇవ్వాలి. అది పన్ను చెల్లించగా మిగిలిన మొత్తమా .. పీఎఫ్‌ విత్‌డ్రాయలా, ఎన్‌ఎస్సీల మెచ్యూరిటీ మొత్తమా, జీవిత బీమా నుండి వచ్చిందా .. మీ పుత్రరత్నం విదేశాల నుండి మీకు పంపినదా .. ఏదైనా ఫర్వాలేదు. సోర్సు అంటూ ఒకటి ఉండాలి. అదీ పక్కాగా ఉండాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఉండి తీరాలి. ఇక బంగారమా.. భవంతా .. లేక జాగానా.. ఏదైనా మీ ఇష్టం. 

రాయితీలు లేవ్‌.. అయినా సరే
బంగారం కొనడం వల్ల ఎటువంటి రాయితీలు, మినహాయింపులు రావు. ఇన్‌కం ట్యాక్స్‌ చట్టంలో వీటి గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. మీరు కొన్న బంగారం ధరకి ‘సోర్స్‌‘ ఉండాలి. వివరణ ఇవ్వాలి. బంగారం ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. ఈ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. అమ్మతే లాభం వస్తే ఆ లాభాన్ని లేదా నష్టాన్ని మూలధనం లాభనష్టాల్లా భావిస్తారు. దీర్ఘకాలికం అయితే 20 శాతం రేటు చొప్పున పన్ను వేస్తారు. దీర్ఘకాలికం కాకపోతే శ్లాబుని బట్టి రేటు ఉంటుంది. సెస్సు అదనం. బంగారమైనా ఆభరణాలైనా ఇదే తీరు. కొంటున్నప్పుడు ఎటువంటి రాయితీలు రావు. అమ్మినప్పుడు పన్ను భారం ఉంటుంది. పన్ను భారం చెల్లించితే మిగతా చాలా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. మంచి ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ .. ఆలికి సింగారం.. అదనుకి బంగారం అన్న పాత సామెత ఈ రోజుకీ వర్తిస్తుంది. 

జాగా విషయంలో
జాగా/ఫ్లాటుకి కూడా బంగారంలాగానే. కొన్నందుకు ఎటువంటి మినహాయింపు ఉండదు. అమ్మితే పన్ను భారం ఉంటుంది. వేలల్లో కొని కోట్లలో అమ్మిన సందర్భాలు ఉన్నా ఎంతో లాభం ఉంటుంది. అందులో 20 శాతం ప్రభుత్వానికి పోతుంది. మిగతా అంతా మనదే. ఇంత పెద్ద మొత్తంతో చక్కటి ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ చేసుకోవచ్చు.  

సొంతిళ్లు
సొంత ఇల్లు ఎంతో మందికి కల. ఆ కల సాకారం అవ్వటానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు. ఇంటి గురించి అంటే ఫ్లాటు లేదా ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం వంటివి వస్తాయి. సేవింగ్స్‌ / స్వంత డబ్బులతో కొంటే ఎటువంటి రాయితీలు రావు. ఎటువంటి మినహాయింపులు రావు. అప్పు చేసి కడితే / కొంటే ఆ అప్పు మీద వడ్డీ కట్టాల్సి ఉంటే .. వడ్డీకి మినహాయింపు ఉంది. అప్పు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇచ్చే వ్యక్తికి ‘సోర్స్‌‘ సామర్థ్యం ఉండాలి. కాగితాలు ఉండాలి. ఈ అప్పుని తిరిగి చెల్లించినందుకు గాను కూడా మినహాయింపు పొందవచ్చు. రుణం చెల్లించేటప్పుడు నిర్దేశించిన వారి నుంచే అప్పులు తీసుకుని ఉండాలి. సెక్షన్‌ 80సి కింద రూ. 1,50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వడ్డీ నిమిత్తం రూ. 2,00,000 దాటితే ఇవ్వరు. మీరే ఆలోచించుకోండి. నిర్ణయం ఏదైనా చట్టబద్ధం అవ్వాలి. బ్లాక్‌ వ్యవహారాలు చేయకండి. మీ కుటుంబ అవసరాలు, ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి.   
కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)
 

చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే..

మరిన్ని వార్తలు