నగదుని దాటేయనున్న డిజిటల్‌ వాలెట్లు

19 May, 2022 12:45 IST|Sakshi

వరల్డ్‌పే ఫ్రం ఎఫ్‌ఐఎస్‌ నివేదిక 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చెల్లింపుల కోసం నగదు, క్రెడిట్‌ కార్డుల నుంచి డిజిటల్‌ వాలెట్లు, బై నౌ, పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌) విధానాలకు మళ్లే ధోరణులు పెరుగుతున్నాయని ఫిన్‌టెక్‌ సంస్థ వరల్డ్‌పే ఫ్రం ఎఫ్‌ఐఎస్‌ ఒక నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో 2023 నాటికి డిజిటల్‌ వాలెట్ల ద్వారా చెల్లింపులు .. నగదు లావాదేవీల పరిమాణాన్ని అధిగమించనున్నట్లు గ్లోబల్‌ పేమెంట్స్‌ రిపోర్టులో (జీపీఆర్‌) పేర్కొంది. 2021–2025 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్‌ మార్కెట్‌ 96 శాతం వృద్ధి చెంది 120 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు తెలిపింది. 

టెక్నాలజీ, డిజిటలీకరణ పెరగడంతో భారత్‌లో నగదురహిత చెల్లింపుల విధానాలు గణనీయంగా ఊపందుకున్నట్లు పేర్కొంది. 2021లో ఈ–కామర్స్‌ చెల్లింపుల కోసం అత్యధికంగా డిజిటల్‌ వాలెట్లు (45.4 శాతం), డెబిట్‌ కార్డులు (14.6 శాతం), క్రెడిట్‌ కార్డులను (13.3 శాతం) వినియోగించినట్లు జీపీఆర్‌ తెలిపింది. ప్రీపెయిడ్‌ కార్డులు, బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్లు, క్యాష్‌ ఆన్‌ డెలివరీ వంటి విధానాల మార్కెట్‌ వాటా తగ్గుతోందని, 2025 నాటికి ఈ–కామర్స్‌ లావాదేవీల విలువలో వీటి పరిమాణం కేవలం 8.8 శాతానికి పరిమితం కావచ్చని వివరించింది. డిజిటల్‌ వాలెట్ల ద్వారా చేసే చెల్లింపుల వాటా 52.9 శాతానికి పెరుగుతుందని తెలిపింది.  

చదవండి: సిప్‌.. సిప్‌.. హుర్రే!

మరిన్ని వార్తలు