ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్‌

21 Aug, 2021 07:42 IST|Sakshi

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్‌ రెండో రోజూ వెనకడుగు వేసింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశపు మినిట్స్‌ బుధవారం వెల్లడయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలను ఉపసంహరించుకునే(ట్యాపరింగ్‌) అంశంపై ఫెడ్‌ అధికారులు చర్చించినట్లు మినిట్స్‌లో వెల్లడైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తెరపైకి వచ్చాయి. 

చదవండి : 5g Smartphone : దూసుకెళ‍్తున్న అమ్మకాలు

వ్యాక్సినేషన్‌ తక్కువగా నమోదైన ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌ కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ తమ దేశానికే చెందిన దిగ్గజ ఐటీ సంస్థలపై చైనా రెగ్యులేటరీ కఠిన ఆంక్షలను విధించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పతనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండో రోజూ క్షీణించాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. 

సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనమై 55,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లను కోల్పోయి 16,500 దిగువను 16,450 వద్ద నిలిచింది. మార్కెట్‌ పతనంలో భాగంగా మెటల్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు ఆగలేదు. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు పతనమై 74.39 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,287 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.119 కోట్ల షేర్లను కొన్నారు.

మెటల్‌ షేర్లలో మంటలు... 
ఈ ఏడాదిలో చైనా స్టీల్‌ ఉత్పత్తి భారీగా తగ్గిపోవచ్చని ప్రముఖ మైనింగ్‌ కంపెనీ బీహెచ్‌పీ గ్రూప్‌ తన కమోడిటీ అవుట్‌లుక్‌లో తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐరన్‌ ఓర్‌ ఫ్యూచర్లు నెలరోజుల కనిష్టానికి కుప్పకూలిపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్‌ షేర్లపైనా పడటంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఆరున్నర పతనాన్ని చవిచూసింది. ఎన్‌ఎండీసీ, వేదాంత, టాటా స్టీల్, సెయిల్, జిందాల్‌ స్టీల్‌ షేర్లు పదిశాతం నుంచి ఎనిమిదిశాతం క్షీణించాయి.

కార్‌ట్రేడ్‌ టెక్‌ ... లిస్టింగ్‌లో డీలా   
ఆటో క్లాసిఫైడ్‌ సంస్థ కార్‌ట్రేడ్‌ టెక్‌ షేర్లు లిస్టింగ్‌ తొలిరోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధర రూ.1,618తో పోలిస్తే బీఎస్‌ఈలో ఒకశాతం డిస్కౌంట్‌తో రూ.1,600 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 9% క్షీణించి రూ.1475 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 7% నష్టంతో రూ.1501 వద్ద ముగిశాయి. 

మరిన్ని వార్తలు