కీస్టోన్‌ రియల్టర్స్‌ ఐపీవో ఓకే

17 Nov, 2022 05:56 IST|Sakshi

చివరి రోజుకి 2 రెట్లు స్పందన

న్యూఢిల్లీ: రుస్తోంజీ బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కీస్టోన్‌ రియల్టర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి ఓమాదిరి స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా 2 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 86,47,858 షేర్లను ఆఫర్‌ చేయగా.. 1,73,72,367 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్‌) నుంచి 3.84 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 3.03 రెట్లు అధిక బిడ్స్‌ దాఖలయ్యాయి.

రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో మాత్రం 53 శాతమే సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. షేరుకి రూ. 514–541 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 635 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 190 కోట్లు అందుకున్న విషయం విదితమే. దాదా పు రూ. 342 కోట్ల రుణ చెల్లింపులు, భవిష్యత్‌ రియల్టీ ప్రాజెక్టులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు నిధులను వినియోగించనుంది. 1995లో ఏర్పాటైన కంపెనీ 32 ప్రాజెక్టులను పూర్తి చేయగా.. ప్రస్తుతం 12 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో మరో 19 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది.

>
మరిన్ని వార్తలు