ఖాదీ బ్రాండ్‌కు బలం, ఆ మూడు దేశాల్లో..

11 Jul, 2021 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఖద్దరు మీద పూర్తి పేటెంట్‌ హక్కులు మన దేశానివే. అందుకే ‘ఖాదీ’ అనే బ్రాండ్‌ను పరిరక్షించే పనిని బాధ్యతగా తీసుకుంది ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్ కమిషన్‌(కేవీఐసీ). ఇతర దేశాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు దేశాలు ఖాదీ ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్‌ పరిధిలోకి వచ్చాయి. 

ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో కేవీఐసీ పూర్తి వివరాలను తెలిపింది. భూటాన్‌, యూఏఈ తోపాటు మెక్సికో దేశాలు ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో నలభై దేశాల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో పాటు ఖతర్‌, శ్రీలంక, ఇటలీ, జపాన్‌, న్యూజిల్యాండ్‌, సింగపూర్‌, బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాలు ట్రేడ్‌మార్క్‌ కోసం ఎదురు చూస్తున్నాయని కేవీఐసీ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా వెల్లడించారు. 

ఖాదీ గుర్తింపు, గ్లోబల్‌ పాపులారిటీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది కేవీఐసీ. ఇందులో భాగంగానే ఈ జూన్‌ 28న యూఏఈకి, జులై 9న భూటాన్‌లకు ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ రెండుదేశాల కంటే ముందు పోయిన డిసెంబర్‌లోనే మెక్సికో ఖాదీ ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్ లేకపోతే.. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతి లేనట్లే. 

ఇంతకు ముందు జర్మనీ, యూకే, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలకు అనుమతి దొరికాయి. తాజాగా మూడు దేశాల అనుమతులతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.  దీంతో ఆయా దేశాలు ఖాదీ ఫ్యాబ్రిక్‌, ఖాదీ రెడిమేడ్‌ గార్మెంట్స్‌, ఖాదీ సోప్‌లు, ఖాదీ కాస్మటిక్స్‌, అగరవత్తులు ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ దొరికినట్లయ్యింది.

మరిన్ని వార్తలు