హాట్‌కేకుల్లా బుక్కైన కియా నయా కార్‌..! ఏకంగా 50 వేలకు పైగా..కేవలం..

12 Mar, 2022 16:27 IST|Sakshi

దక్షిణ కొరియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ భారత్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారత మార్కెట్లలో సరికొత్త మోడల్స్‌తో అదరగొడుతోంది.గత నెలలో కియా భారత్‌లోకి కియా ఎంపీవీ వెహికిల్‌ కియా కారెన్స్‌ను లాంచ్‌ చేసింది.జనవరి 14, 2022న కియా కారెన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమవ్వగా.. కేవలం రెండు నెలల్లోనే 50,000 బుకింగ్‌లను దాటినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ బుకింగ్స్‌లో ఎక్కువగా టైర్‌-1, టైర్‌-2 నగరాల్లోనే 60 శాతం పైగా బుకింగ్స్‌ జరిగాయి. దేశ వ్యాప్తంగా లగ్జరీ కార్లను కొనేవారిలో 45 శాతం మంది కియా కారెన్స్‌ తొలి ఎంపికగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. 

సమానంగా డిమాండ్‌..!
కియా కారెన్స్​ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకూ డిమాండ్ సమానంగా ఉందని కియా ఇండియా తెలియజేసింది. దాదాపు 50 శాతం మంది వినియోగదారులు డీజిల్ వేరియంట్లను బుక్‌ చేసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, కియా కారెన్స్​ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 30% మంది కస్టమర్లను మాత్రమే ఆకర్షించగలిగింది. కారెన్స్ మాన్యువల్ ట్రిమ్‌ల వేరియంట్స్‌ ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. ఫిబ్రవరిలో, కియా ఇండియా ప్రారంభించిన 13 రోజుల్లోనే 5,300 కారెన్స్​ కార్లను విక్రయించింది.

కియా కారెన్స్ కేవలం రెండు నెలల కంటే తక్కువ సమయంలో అద్భుతమైన మైలురాయి సాధించడంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ..‘ఫ్యామిలీ మూవర్​ కార్ల సెగ్మెంట్​లో మునుపెన్నడూ లేని విధంగా కియా కారెన్స్ రికార్డు సృష్టించింది​. ఇది మా ఇతర ఎస్​యూవీల వలే అతి తక్కువ కాలంలోనే భారీ బుకింగ్స్‌​ను సాధించింది. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇంజిన్ విషయానికి వస్తే..!
కియా కరెన్స్‌ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్,  టర్బో పెట్రోల్‌తో  7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. 

ధర ఎంతంటే..!
కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రి-బుకింగ్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి  రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్‌, ప్రేస్టిజ్‌ప్లస్‌, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. 

చదవండి: వైరస్‌,బ్యాక్టిరియా ప్రూఫ్‌ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్‌..!

మరిన్ని వార్తలు