అనంతపూర్‌ ప్లాంట్‌ నుంచి కియా కరెన్స్‌

1 Feb, 2022 08:26 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ప్లాంటు నుంచి కరెన్స్‌ మోడల్‌ తొలి కారు సోమవారం వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపూర్‌ జిల్లాలో కియా అత్యాధునిక తయారీ కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాకు చెందిన కియా 2021 డిసెంబర్‌లో రిక్రియేషనల్‌ వెహికిల్‌ కరెన్స్‌ను భారత్‌ వేదికగా తొలిసారిగా ప్రదర్శించింది. ఫిబ్రవరిలో అధికారికంగా ఈ కారును ఆవిష్కరించనున్నారు. అనంతపూర్‌ ప్లాంట్‌ నుంచి 80కిపైగా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. దేశీయ మార్కెట్లో కంపెనీ నుంచి ఇది నాల్గవ మోడల్‌. ఇప్పటికే సంస్థ సెల్టోస్, సోనెట్, కార్నివాల్‌ మోడళ్లను విక్రయిస్తోంది. ప్యాసింజర్‌ కార్ల విపణిలో కొత్త విభాగాన్ని కరెన్స్‌ సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది. యువ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్‌కు రూపకల్పన చేసినట్టు కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్‌ పార్క్‌ ఈ స ందర్భంగా తెలిపారు. ఆధునిక భారతీయ కుటుంబాలను ప్రతిబింబించే ఉత్పత్తిని తీసుకురావడానికి తమ బృందాలు అవిశ్రాంతంగా పనిచేశాయని అన్నారు.  

ఇవీ కరెన్స్‌ విశిష్టతలు.. 
1.4 లీటర్, 1.5 లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో అయిదు రకాల ఇంజన్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్, అయిదు రకాల ట్రిమ్‌ లైన్స్‌.. మూడు వరుసల్లో 6, 7 సీట్లతో కరెన్స్‌ లభిస్తుంది. 4,540 మిల్లీమీటర్ల పొడవు ఉంది. డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌తో 7 స్పీడ్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో 6 స్పీడ్‌ పెట్రోల్, డీజిల్‌ పవర్‌ట్రైన్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్, డౌన్‌హిల్‌ బ్రేక్‌ కంట్రోల్, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్స్, స్లైడింగ్‌ టైర్‌ సీట్‌ అండర్‌ట్రే, రిట్రాక్టేబుల్‌ సీట్‌బ్యాక్‌ టేబుల్, రేర్‌ డోర్‌ స్పాట్‌ ల్యాంప్, మూడవ వరుసలో బాటిల్, గ్యాడ్జెట్‌ హోల్డర్, 216 లీటర్ల లగేజ్‌ స్పేస్‌ వంటి హంగులు ఉన్నాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.14–19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. బుకింగ్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి.

చదవండి:AP: పెట్టుబడులకు పెట్టని కోట 

మరిన్ని వార్తలు