వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్‌ కారు..మొదలుకానున్న బుకింగ్స్‌..ఎప్పుడంటే..?

21 Apr, 2022 14:16 IST|Sakshi

దక్షిణ కొరియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ త్వరలోనే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. కియా మోటార్స్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కియా ఈవీ6(Kia EV6) ఎలక్ట్రిక్‌ కారును భారత్‌ మార్కెట్లలో అరంగేట్రం చేసేందుకు  కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. 

బుకింగ్స్‌ ప్రారంభం..!
భారత మార్కెట్లలోకి కియా ఈవీ6 ఎలక్ట్రిక్‌ కారును  కొద్ది రోజుల్లోనే లాంచ్‌ చేసేందుకు కియా ఏర్పాట్లను వేగవంతం చేసింది.  ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 బుకింగ్స్‌ను మే 26న మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాగా భారత్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6 కారును మే 2021లో కియా మోటార్స్‌ ఆవిష్కరించింది. 

సూపర్‌ ఫీచర్స్‌తో..!
కియా ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్‌ఎల్స్‌తో వస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్ ఆధునిక, సొగసైన, ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. మొత్తంమీద ఈ కారు ఏరోడైనమిక్ స్టైలింగ్ అంశాలను రానుంది.  Kia EV6 రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. 

రేంజ్‌ విషయానికి వస్తే..!
అంతర్జాతీయ మార్కెట్లో కియా ఈవీ6 వాహనం 58kWh, 77.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటి సహాయంతో డ్రైవింగ్ పరిధి మెరుగవ్వనుంది.  ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇక AWD వెర్షన్‌లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కియా ఈవీ6 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

చదవండి: స్కోడా కీలక నిర్ణయం..సెకండ్‌ హ్యండ్‌ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..!

మరిన్ని వార్తలు