నయా కారు విడుదలకు సిద్దమవుతున్న కియా మోటార్స్.. ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్!

6 Mar, 2023 14:29 IST|Sakshi

సౌత్ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలో తన ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 'ఈవీ9'ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా సమాచారం కొన్ని టీజర్ వీడియోల ద్వారా వెల్లడైంది.

నిజానికి ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ గతేడాది జరిగిన 2022 ఆటో ఎక్స్​పో వేదిక మీద కనిపించింది. కంపెనీ ఈ కారుని అభివృద్ధి చేయడానికి 44 నెలల సమయం పట్టిందని వెల్లడించింది. మొదటి సారి 2021 లాస్​ ఏంజెల్స్​ మోటార్​ షో కనిపించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉత్పత్తికి నోచుకోలేదు.

ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా మోటార్స్, ఈ కొత్త మోడల్ విడుదలతో మరిన్ని అద్భుతమైన అమ్మకాలు పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటో ఎక్స్​పోలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది.

కియా ఈవీ9 మస్క్యులర్​ క్లామ్​షెల్​ బానెట్​, టైగర్​ నోస్​ గ్రిల్​, ఆల్​ ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, ఓఆర్​వీఎమ్ స్థానంలో కెమెరాలు, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో వర్టికల్లీ స్టేక్​డ్​ టెయిల్​ల్యాంప్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​ వంటివి చూడవచ్చు.

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్​బోర్డ్ చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, యోక్​ స్టైల్​ స్టీరింగ్​ వీల్​, పనారోమిక్​ సన్​ రూఫ్​, మల్టీ కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, మల్టీ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, రెండు పెద్ద స్క్రీన్స్ వంటివి ఇందులో అమర్చబడి ఉంటాయి.

కియా ఈవీ9 ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 450కిమీ రేంజ్ అందిస్తుంది సమాచారం, అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలవుతుంది. భారతీయ మార్కెట్లో 2024-2025 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు