కియా ఇండియా సంచలనం..! విదేశాలకు లక్షకుపైగా..అది కూడా ఏపీ నుంచే..!

4 Feb, 2022 03:27 IST|Sakshi

రెండున్నరేళ్లలోనే రికార్డు నమోదు

అనంతపూర్‌ ప్లాంట్‌లో తయారీ

Kia India News In Telugu: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త రికార్డు సాధించింది. భారత్‌ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో కంపెనీకి అత్యాధునిక ప్లాంటు ఉంది. 2019 సెప్టెంబర్‌ నుంచి ఈ కేంద్రం ద్వారా ఎగుమతులను కియా మొదలు పెట్టింది. 2022 జనవరి నాటికి 1,01,734 యూనిట్లు నమోదు చేసింది.

రెండున్నరేళ్లలోపే ఈ ఘనతను సాధించామని కంపెనీ గురువారం తెలిపింది. భారత్‌ను తయారీ, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోందని సంస్థ వివరించింది. సెల్టోస్, సోనెట్‌ కార్లను మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్‌లోని 91 దేశాలకు కియా ఎగుమతులు చేస్తోంది. విదేశాలకు వెళ్తున్న మొత్తం కార్లలో సెల్టోస్‌ 77, సోనెట్‌ 23 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.  

క్లిష్టమైన ఉత్పత్తి కేంద్రాలలో..
అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా తయారీ, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసే విషయంలో కూడా కియా కార్పొరేషన్‌కు భారత్‌ ఒక వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం అని సంస్థ ఇండియా ఎండీ, సీఈవో టే జిన్‌ పార్క్‌ తెలిపారు.  ‘ప్రపంచంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మా అనంతపూర్‌ ప్లాంట్‌ చిన్న, మధ్య తరహా ఎస్‌యూవీల కోసం అత్యంత క్లిష్టమైన ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా మారింది. భారతీయ ఉత్పత్తులు నిజంగా అంతర్జాతీయ స్థాయి అనే వాస్తవాన్ని ఇది స్పష్టం చేస్తోంది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు