కియా నుంచి ఎలక్ట్రిక్‌ కారు ?

5 Jun, 2021 14:49 IST|Sakshi

సోల్‌ మోడల్‌ తెచ్చేందుకు యత్నాలు

ఇప్పటికే లేబుల్‌ రిజిస్ట్రర్‌ చేసిన కియా

వెబ్‌డెస్క్‌: అతి తక్కువ కాలంలోనే ఇండియా కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన కియా సంస్థ నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. ముఖ్యంగా ఫ్యూచర్‌ కార్లుగా చెప్పుకుంటున్న ఎలక్ట్రిక్‌ కారును తెచ్చేందుకు కియా సన్నాహాలు చేస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కియా తన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) మోడల్‌ సోల్‌ లేబుల్‌ని ఇండియాలో రిజిస్ట్రర్‌ చేసింది. 

సోల్‌ వస్తుందా ?
కియా కంపెనీలో ఈవీ వెర్షన్‌లో సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌గా సోల్‌కి పేరుంది. ఇప్పటికే రెండు మోడల్స్‌ విదేశీ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. థర్డ్‌ జనరేషన్‌ మోడల్‌ విదేశాల్లో లాంఛింగ్‌కి సిద్ధంగా ఉంది. ఈ థర్డ్‌ మోడల్‌ పెట్రోల్‌, ఈవీ వెర్షన్లలో లభ్యం అవుతుందని ఇప్పటికే కియా ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియాలో సైతం సోల్‌ పేరుతో కియా లేబుల్‌ రిజిస్ట్రర్‌ చేసింది. దీంతో సోల్‌ మోడల్‌ని ఇండియాలో కూడా లాంఛ్‌ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కొత్త మోడల్‌ ఎంట్రీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

లాంగ్‌రేంజ్‌.
కియా సోల్‌ థర్డ్‌ జనరేషన్‌ ఈవీ మోడల్‌లో  బ్యాటరీలకు సంబంధించి లాంగ్‌ రేంజ్‌, స్టాండర్డ్‌ రేంజ్‌ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో లాంగ్‌రేంజ్‌లో 64కిలోవాట్‌ బ్యాటరీతో 452 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా... స్టాండర్డ్ రేంజ్‌లో 39.2 కిలోవాట్‌ బ్యాటరీతో 277 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 

కోనాకు పోటీగా
ఇండియా కార్ల మార్కెట్‌లో 10 శాతానికి పైగా వాటా దక్కించుకుంది కియా. సెల్టోస్‌, సోనెట్‌ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఇప్పటికే హుందాయ్‌ నుంచి కోనా మోడల్‌ అందుబాటులో ఉంది. దీనికి పోటీగా కియా సంస్థ సోల్‌ను మార్కెట్‌లోకి తెవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

ఫ్యూచర్‌ కార్స్‌
రాబోయే రోజుల్లో ఆటోమోబైల్‌ రంగంలో పెట్రోల్‌, డీజీల్‌ వాహనాల మార్కెట్‌కి ఎలక్ట్రిక్‌ వాహనాల నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది. పర్యావరణ కాలుష్యం దృష్ట్యా భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీంతో అనేక కంపెనీలు క్రమంగా ఎలక్ట్రిక్‌ మోడల్లు తెచ్చేందుకు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

చదవండి : మహీంద్ర బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు