వీడే ఫ్యూచర్‌ ఎలన్‌మస్క్‌.. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఓపెన్‌ లెటర్‌

29 Sep, 2021 11:44 IST|Sakshi

స్ఫూర్తిదాయక వ్యక్తులు ఎక్కడో ఉండరు. మన మధ్యనే ఉంటారు. వాళ్ల గెలుపు వాళ్లకు కూడా తెలియకుండా.. మరికొందరిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అలాంటి విషయమే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.  తొమ్మిదేళ్ల పిల్లాడు ఒకడు.. భావోద్వేగంగా రాసిన లేఖ ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 
 


టెస్లా, స్పేస్‌ఎక్స్‌లతో పాటు క్రిప్టోకరెన్సీ వ్యవహారాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలన్‌ మస్క్‌(51). పైకి ఊహాతీత చేష్టలు ప్రదర్శించే మస్క్‌.. మేధావి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ఆలోచనలున్న ఈయన.. యువతలో స్ఫూర్తి నింపుతుంటాడు కూడా. అలా ఇక్కడో చిన్నారి దృష్టిలో కూడా మస్క్‌ హీరో అయ్యాడు.
   

ఎలన్‌ మస్క్‌కు వీరాభిమాని అయిన కెంప్‌ ప్రెస్లే అనే తొమ్మిదేళ్ల చిన్నారి చేత్తో పేపర్‌ మీద క్రియేటివిటీగా రాసిన లేఖ ఇది. మస్క్‌కు అమాయకంగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూనే.. ఎన్నో గొప్ప విషయాల గురించి ఆరాతీశాడు ఆ కుర్రాడు. నీ(మస్క్‌) కెరీర్‌ ఎలా మొదలైంది? నీ మీద ప్రభావం చూపిన అంశాలేవీ? టెస్లాలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నావ్‌? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.  అంతేకాదు పనిలో పనిగా చివర్లో సోలార్‌ పవర్‌ కారు తయారు చేయమని మస్క్‌కే సలహా ఇచ్చాడు ఈ బుడతడు.

మస్క్‌ స్ఫూర్తితో తానూ జీవితంలో ఎదగాలని అనుకుంటున్నానని చెబుతూ.. చివర్లో ‘ఇట్లు ఫ్యూచర్‌ మస్క్‌’ అంటూ తన గోల్‌ ఏంటో చెప్పకనే చెబుతూ లేఖను ముగించాడు కెంప్‌ ప్రెస్లే . కొడుకు కోరిక మేరకు ఆ చిన్నారి తండ్రి కెంప్టన్‌ ప్రెస్లే ఆ లేఖ ఫొటోను ట్విటర్‌ పోస్ట్‌ చేశాడు. అంతేకాదు ఎలన్‌ మస్క్‌ను సైతం ఆ పోస్ట్‌కి ట్యాగ్‌ చేశాడు. చాలామందిని ఈ లేఖ ఇప్పుడు కదిలిస్తోంది.  మరి సోషల్‌ మీడియాలో నిత్యం పోస్టులతో యాక్టివ్‌గా ఉండే ఎలన్‌ మస్క్‌..  ఈ చిన్నారి వీరాభిమానానికి స్పందిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

చదవండి: ఎలన్‌ మస్క్‌.. సంపాదన విలువెంతో తెలుసా?

మరిన్ని వార్తలు