గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా అమ్మకం!

26 Sep, 2020 04:27 IST|Sakshi

విక్రయించనున్న కంపెనీ ప్రమోటర్లు

రేసులో కేకేఆర్, బెయిన్‌ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్‌ 

హైదరాబాద్‌: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు కేకేఆర్, బెయిన్‌ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్‌ రేసులో ఉన్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిష్క్రమించాలన్న ప్రణాళికను ప్రమోటర్లు పునరుద్ధరించారని, మెజారిటీ వాటాను ప్రీమియం వాల్యుయేషన్‌తో విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రాన్యూల్స్‌ ఇండియాలో ఈ ఏడాది జూన్‌ నాటికి ప్రమోటర్లకు 42.13 శాతం వాటా ఉంది. కాగా, ప్రతిపాదిత వాటా కొనుగోలుకై నాన్‌ బైండింగ్‌ బిడ్లను మూడు సంస్థలు దాఖలు చేసినట్టు సమాచారం. కొనుగోలుదార్ల వేటకై ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ను కంపెనీ ప్రమోటర్లు నియమించారు.

వాటాల విక్రయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందిం^è లేమని గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఈడీ ప్రియాంక చిగురుపాటి స్పష్టం చేశారు. అయితే ఫార్మా రంగంలో ఈ స్థాయి డీల్స్‌ సహజమని, దీంతో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌ ఆసక్తి చూపుతున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ డీల్‌ను వేదికగా చేసుకుని మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన అని ఆయన అన్నారు. మూడు సంస్థలూ పోటీపడితే బిడ్డింగ్‌ వార్‌కు అవకాశం ఉంది. ప్రమోటర్లు తమ వాటా విక్రయానికి ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్, వారసత్వ ప్రణాళిక సమస్యలు కారణంగా తెలుస్తోంది. 2019 నవంబరులోనూ ప్రమోటర్లు తమ వాటాను అమ్మాలని భావించారు. తాజా వార్తల నేపథ్యంలో గ్రాన్యూల్స్‌ షేరు ధర శుక్రవారం 4.20 శాతం అధికమై రూ.375.75 వద్ద స్థిరపడింది.
     

మరిన్ని వార్తలు