వినీ కాస్మెటిక్స్‌లో కేకేఆర్‌కు వాటాలు

22 Jun, 2021 02:27 IST|Sakshi

రూ. 4,600 కోట్ల పెట్టుబడి

మెజారిటీ వాటా కొనుగోలు

ముంబై: ఫాగ్‌ తదితర డియోడ్రెంట్‌ బ్రాండ్‌ల తయారీ సంస్థ వినీ కాస్మెటిక్స్‌లో ప్రైవేట్‌ దిగ్గజం కేకేఆర్‌ మెజారిటీ వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం 625 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 4,600 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. సంస్థ చైర్మన్‌ దర్శన్‌ పటేల్, జేఎండీ దీపం పటేల్‌ సారథ్యంలోని వినీ వ్యవస్థాపక గ్రూప్‌తో పాటు సెకోయా క్యాపిటల్‌ ఈ వాటాలను విక్రయించనున్నాయి. ఆ తర్వాత కూడా సహ వ్యవస్థాపకులకు కంపెనీలో గణనీయంగా వాటాలు ఉంటాయి.

అటు ప్రస్తుత ఇన్వెస్టరు వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ కూడా వ్యవస్థాపక గ్రూప్‌ నుంచి మరిన్ని షేర్లు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీలో తన వాటాను పెంచుకోనుంది. కేకేఆర్‌ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది. అయితే, సంస్థలో ప్రస్తుతం ఎవరికి ఎంత వాటా ఉన్నది మాత్రం వెల్లడించలేదు. డీల్‌ అనంతరం కూడా దర్శన్‌ పటేల్‌ చైర్మన్‌గా కొనసాగుతారని, దీపం పటేల్‌ వైస్‌ చైర్మన్‌గా నియమితులవుతారని పేర్కొంది. దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు, వచ్చే నెలాఖరులోగా డీల్‌ పూర్తికాగలదని భావిస్తున్నట్లు కేకేఆర్‌ పార్ట్‌నర్‌ గౌరవ్‌ ట్రెహాన్‌ వివరించారు. కార్యకలాపాలను తదుపరి స్థాయికి పెంచుకునేందుకు కేకేఆర్‌ అనుభవం, వనరులు తోడ్పడగలవని దర్శన్‌ పటేల్‌ తెలిపారు.

ఆసియన్‌ ఫండ్‌  ఐV ద్వారా కేకేఆర్‌ ఈ పెట్టుబడులు పెడుతోంది. గతేడాది వ్యవధిలో జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్, లెన్స్‌కార్ట్, రిలయన్స్‌ జియో తదితర సంస్థల్లో కూడా ఇది ఇన్వెస్ట్‌ చేసింది. వినీకి 7,00,000 పైగా పాయింట్స్‌ ఆఫ్‌ సేల్, 3,000 పైచిలుకు డీలర్లు, 1,200 మంది దాకా సేల్స్‌ సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 50 పైగా దేశాల్లో ఉత్పత్తులు విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు