గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు.. రియల్‌ ఎస్టేట్‌పై తగ్గిన ఆసక్తి!

21 Jul, 2022 07:06 IST|Sakshi

న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా, నారెడ్కో రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ సూచీ క్యూ2లో 62 పాయింట్లకు పరిమితమైంది. జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ1) ఇది 68గా నమోదైంది. డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలపై సర్వే ప్రాతిపదికన ఈ సూచీలో స్కోరు ఉంటుంది. 50కి ఎగువన ఉంటే సెంటిమెంటు ఆశావహంగా ఉన్నట్లు, సరిగ్గా 50 ఉంటే యథాతథంగా లేదా తటస్థంగా ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే నిరాశ ధోరణిలో ఉన్నట్లు పరిగణిస్తారు. 

ఈ ఏడాది మే, జూన్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్‌ సూచీ స్కోరు తగ్గిందని వివరించాయి.  వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్‌ ధోరణి సెంటిమెంట్‌ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత, భవిష్యత్‌ సూచీలు రెండూ 50కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు  వచ్చే ఆరు నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్‌ ఫ్రాంక్‌–నారెడ్కో నివేదికలో పేర్కొన్నాయి. 

నివేదికలోని మరిన్ని వివరాలు..  

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు, యూరప్‌లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. 

రెసిడెన్షియల్‌ విభాగంలో పటిష్టమైన డిమాండ్‌ ఉన్నట్లు గత 8–10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు.

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్‌ ఆఫీస్‌ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3–4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది.

>
మరిన్ని వార్తలు