వారెవ్వా హైదరాబాద్‌.. 31 వేల రిజిస్ట్రేషన్లు.. రూ.15 వేల కోట్లు

11 Jun, 2022 12:38 IST|Sakshi

మధ్యతరగతి గృహాలకు మద్దతు

రూ.50 లక్షల లోపు ఇళ్లకే డిమాండ్‌ 

క్షీణించిన లగ్జరీ గృహాల విక్రయాలు

మేలో గ్రేటర్‌లో 6,301 రిజిస్ట్రేషన్లు

55% మధ్యతరగతి గృహాలే

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సర్వేలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నుంచి గ్రేటర్‌ స్థిరాస్తి రంగం శరవేగంగా కోలుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు హైదరాబాద్‌ నగరంలో రూ.15,071  కోట్లు విలువ చేసే 31,126 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 152 శాతం ఎక్కువ. గత నెలలో గ్రేటర్‌లో రూ.3,058 కోట్ల విలువ చేసే 6,301 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే ఇది 17.6 శాతం వృద్ధి.  

రూ.50 లక్షల లోపు ఇళ్లకే డిమాండ్‌.. 
గత నెలలో అమ్ముడైన గృహాలలో 55 శాతం రూ.25–50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లే కావటం గమనార్హం. రూ.25 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు డిమాండ్‌ క్రమంగా తగ్గుతుంది. గతేడాది మేలో విక్రయమైన ఇళ్లలో వీటి వాటా 39 శాతంగా ఉండగా... గత నెల నాటికి 18 శాతానికి తగ్గింది. రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల వాటా గతేడాది మేలో 35 శాతం ఉండగా.. ఇప్పుడవి 55 శాతానికి పెరిగాయి.

రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 16 శాతం నుంచి 20 శాతానికి వృద్ధి చెందాయి. ఇక రూ.కోటి పైన ధర ఉన్న ప్రాపర్టీల వాటా గతేడాది మేలో 9 శాతం ఉండగా.. ఇప్పుడవి 6 శాతానికి క్షీణించాయి. గత నెలలో విక్రయమైన గృహాలలో 92 శాతం గృహాలు 2 వేల చదరపు గజాల లోపు ఉన్న ఫ్లాట్లే. గతేడాది మేలో వీటి వాటా 86 శాతంగా ఉంది.  

చదవండి: తెలంగాణ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్‌!

మరిన్ని వార్తలు