హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్

6 Apr, 2021 04:05 IST|Sakshi

‌ఈ ఏడాది క్యూ1లో 5 శాతం వృద్ధి 

మిగిలిన అన్ని నగరాల్లోనూ క్షీణతే.. 

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రిపోర్ట్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్, చెన్నై నగరాలు మినహా దేశంలోని ఇతర మెట్రోలన్నింట్లోనూ గృహాల ధరలు క్షీణించాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే 2021 జనవరి–మార్చి (క్యూ1)లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 5 శాతం, చెన్నైలో 8 శాతం మేర వృద్ధి చెందాయి. ఇదే కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 76,006 యూనిట్లు ప్రారంభం కాగా.. 71,963 గృహాలు విక్రయం అయ్యాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా క్యూ1 నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ పన్ను రాయితీలు విక్రయాల వృద్ధికి కారణమని పేర్కొంది. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో  9,349 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 7,170, క్యూ3లో 1,234, క్యూ2లో 1,420 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి 211 శాతం లాంచింగ్స్‌లో వృద్ధి నమోదయింది. అదేవిధంగా విక్రయాల గణాంకాలు చూ స్తే.. నగరంలో  2021 క్యూ1లో  6,909 గృహాలు విక్రయమయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 3,651, క్యూ3లో 1,609, క్యూ2లో 974 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి సేల్స్‌లో 81 శాతం వృద్ధిని సాధించింది. 

లాంచింగ్స్, సేల్స్‌లో ముంబై టాప్‌.. 
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ1లో 76,006 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధి. గతేడాది క్యూ4లో లాంచింగ్స్‌ 55,033, క్యూ3లో 31,106, క్యూ2లో 5,584 యూనిట్లుగా ఉన్నాయి. సేల్స్‌ చూస్తే.. 2021 క్యూ1లో 71,963 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే 44 శాతం ఎక్కువ. 2020 క్యూ4లో 61,593 యూనిట్లు, క్యూ3లో 33,403, క్యూ2లో 9,632 ఇళ్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో గృహాల ప్రారంభం, విక్రయాలలో ముంబై, పుణే నగరాలు టాప్‌ స్థానంలో నిలిచాయి. ముంబైలో 31,515 యూనిట్లు లాంచింగ్‌ కాగా.. పుణేలో 18,042 యూనిట్లయ్యాయి. బెంగళూరులో 7,467, చెన్నైలో 2,981, అహ్మదాబాద్‌లో 3,977, ఎన్‌సీఆర్‌లో 1,626, కోల్‌కతాలో 1,439 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 

మరిన్ని వార్తలు