What Is No Cost EMI: 'నో కాస్ట్' ఈఎంఐ కిరికిరి, అసలు రహస్యం ఇది!

11 Oct, 2022 12:06 IST|Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా రీటైల్‌, ఈ కామర్స్‌ సంస్థలు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా పలు ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్లతో పాటు, నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యాన్నిఅందిస్తుంటాయి. అయితే ఈ నోకాస్ట్‌ ఈఎంఐ అంటే ఏమిటి? ఈ నోకాస్ట్‌ ఈఎంఐ వల్ల కొనుగోలు దారులకు లబ్ధి చేకూరుతుందా? దాని వెనుక ఏదైనా మతలబు దాగి ఉందా?  

ఏడాదిలో జరిగే ఫెస్టివల్స్‌ సీజన్‌లో సంస్థలు ప్రొడక్ట్‌ల అమ్మకాలు జరిగేలా నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. అందుకే కొనుగోలు దారులు గృహోపకరణాలు, వెహికల్స్‌, గాడ్జెట్స్‌ను ఫెస్టివల్‌ సీజన్‌లో కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఈ కొనుగోలు ముందు ఈ నోకాస్ట్‌ ఈఎంఐ గురించి తెలుసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.  

నో కాస్ట్‌ ఈఎంఐ అంటే
ముందుగా నో కాస్ట్‌ ఈఎంఐ అంటే? నోకాస్ట్‌ ఈఎంఐ కింద ఓ వస్తువును ఎంత ధర పెట్టి కొనుగోలు చేస్తామో.. ఆ మొత్తాన్ని నెలనెలా కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తానికే సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయవు. ఇలా నెలవారీ చెల్లించే ఈఎంఐలపై ఎలాంటి వడ్డీని విధించకపోవడాన్ని నోకాస్ట్‌ ఈఎంఐ అంటారు.  


 
నోకాస్ట్‌ ఈఎంఐ కిరికిరి
ఉదాహరణకు రమేష్‌ అనే వ్యక్తి అప్పుడే మార్కెట్‌లో విడుదలైన 5జీ ఫోన్‌ను నో కాస్ట్‌ ఈఎంఐ కింద రూ.30వేలకు కొనుగోలు చేస్తాడు. ఆమొత్తాన్ని 10 నెలల టెన్యూర్‌ కాలానికి ఒక్కో నెల 3వేలు చెల్లించి.. ఈఎంఐని క్లియర్‌ చేస్తాడు. వడ్డీ లేదని తెగ సంబర పడిపోతుంటాడు.   

కానీ ఈ నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌లో జరిగేది అదికాదు. రమేష్‌ ఫోన్‌ ధర వాస్తవానికి రూ.27వేలు ఉంటుంది. సంస్థలు అదనంగా మరో రూ.3వేలు జత చేసి.. ఫోన్‌ ధర రూ.30వేలు ఉందని, మీకు డిస్కౌంట్‌లో జీరోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఊదర గొట్టేస్తుంటాయి. 

మరో రకమైన వసూలు
మరో రకంగా చెప్పాలంటే అదే రమేష్‌ కొన్న 5జీ ఫోన్‌ వాస్తవ ధర రూ.30 వేలు ఉంటుంది. కానీ ఫోన్‌ తయారీ సంస్థలు జీరో కాస్ట్‌ ఈఎంఐ ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తుంటాయి. ఆ ప్రాసెసింగ్‌ ఫీజు ఏంటో తెలుసా? మీకు అందించే ఈఎంఐ కింద సంస్థలు వసూలు చేసే వడ్డీ.   

తస్మాత్‌ జాగ్రత్త 
కాబట్టి, కొనుగోలు దారులు నోకాస్ట్‌ ఈఎంఐలో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే.. తప్పని సరిగా నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

చదవండి👉 ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?

మరిన్ని వార్తలు