ఐటీ రిఫండ్‌ చెక్‌ చేసుకున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి!

12 Sep, 2022 11:41 IST|Sakshi

రిఫండు.. ఆదాయం కాదు 

ఆదాయపు పన్ను శాఖ ఈ మధ్య అంటే.. ఏప్రిల్‌ నుండి ఆగస్టు వరకూ రూ. 1.14 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్లు జారీ చేసింది. రిఫండ్‌ క్లెయిమ్‌ చేసిన వారు మీ మీ బ్యాంకు ఖాతాలను చెక్‌ చేసుకోండి. రిఫండ్‌ క్రెడిట్‌ అయి ఉంటుంది. క్రెడిట్‌ కాకపోతే వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి స్టేటస్‌ తెలుసుకోండి. అన్ని వివరాలు కరెక్టుగా ఉండి.. పన్నుకి సంబంధించిన వివరాలు ఫారం 26 అ  ప్రకారం సరిగ్గా ఉంటే మీరు క్లెయిం చేసిన రిఫండు క్రెడిట్‌ అవుతుంది. 

ఎంత మొత్తం రిఫండు వస్తుంది.. 
మీరు దాఖలు చేసిన రిటర్నులోని అన్ని అంశాలు క్షుణ్నంగా చెక్‌ చేస్తారు. అన్నీ కరెక్టుగా ఉంటే మీరు క్లెయిం చేసినదంతా వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసినట్లయితే, రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. మీరు క్లెయిం చేసిన మొత్తం కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆ ఎక్కువ మొత్తం వడ్డీ అనుకోండి. ఈ రెండింటి మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలాగే, ఫారం 26 అ లో ఈ మేరకు ఎంట్రీలు కనిపిస్తాయి. అప్పుడు పూర్తిగా స్పష్టత వస్తుంది. ఫారం 26 అ  డౌన్‌లోడ్‌ చేసుకుని ఒక కాపీని మీ ఇన్‌కంట్యాక్స్‌ ఫైల్‌లో భద్రపర్చుకోండి. మీ సులువు కోసం .. సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం ఒక ఫైల్‌ నిర్వహించుకోండి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మీ రిఫండు.. మీ ఆదాయం కాదు. దాని మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. మీకు వచ్చిన ఈ రిఫండుని ప్రస్తుత సంవత్సరం రిటర్ను వేసినప్పుడు ‘మినహాయింపు ఆదాయం‘ కింద చూపెట్టుకోవచ్చు. లేదా అధికారులు అడిగినప్పుడు ఈ జమ మొత్తం .. ఆదాయం కాదు అని, రిఫండు వచ్చిందని రుజువులతో పాటు విశదీకరించాలి. అదనంగా వచ్చిన మొత్తం వడ్డీని మాత్రం ప్రస్తుత సంవత్సరంలో ఆదాయంగా, ఇతర ఆదాయాల కింద చూపించాలి. దీని మీద ఎటువంటి మినహాయింపు లేదు. మొత్తం వడ్డీ.. పన్నుకి గురి అవుతుంది. ఈ వడ్డీ విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకండి.

రిఫండు తక్కువ రావచ్చు.. 
మీ రిఫండు క్లెయిం చేసినప్పటికీ పూర్తి మొత్తం రావచ్చు .. లేదా తగ్గవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల, అంకెల తప్పుల వల్ల, ట్యాక్స్‌ క్రెడిట్లు తప్పుగాా రావడం వల్ల మీ ఆదాయం పెరగవచ్చు .. మినహాయింపులు తగ్గనూ వచ్చు. ఆదాయంలో మార్పుల వల్ల, పన్నుల చెల్లింపులు తక్కువ కావడం వల్ల, రిఫండు తక్కువ రావచ్చు. ఇందులో తప్పులుంటే మీరు తెలియజేయవచ్చు. 

రాకపోనూ వచ్చు .. 
అవును. ఒక్కొక్కప్పుడు ఈ సంవత్సరం రిఫండును అసెస్‌ చేసి, ఆర్డర్‌ పాస్‌ చేసి.. గత సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం సర్దుబాటు చేసుకుంటున్నాం అని కూడా అంటారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఆ మేరకు నిజమే అయితే ఊరుకోండి. కాకపోతే వివరణ ఇచ్చి, సవరించుకోండి. చివరిగా మీకు వచ్చిన రిఫండు అనేది ఆదాయం కాదని, అదనంగా వచ్చేది వడ్డీ అని, పన్నుకు గురవుతుందని గుర్తుపెట్టుకోండి.  

మరిన్ని వార్తలు