Koo: ట్విటర్‌ని క్రాస్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇండియన్‌ కంపెనీ

14 May, 2022 12:14 IST|Sakshi

ఏడాదిలో దేశీయంగా ట్విటర్‌ను అధిగమిస్తాం 

‘కూ’ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ  

కోల్‌కతా: యూజర్ల సంఖ్యాపరంగా ఏడాది వ్యవధిలో దేశీయంగా ట్విటర్‌ను అధిగమించగలమని దేశీ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ’కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ వెల్లడించారు. గత రెండేళ్లుగా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆయన తెలిపారు. గత 12 నెలల్లో 3 కోట్ల పైచిలుకు డౌన్‌లోడ్‌లు, నమోదయ్యాయని, యూజర్ల సంఖ్య 10 రెట్లు వృద్ధి చెందిందని రాధాకృష్ణ వివరించారు. 2022 ఆఖరు నాటికి ఈ సంఖ్య 10 కోట్లు దాటగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఇంగ్లీష్‌ భాషయేతర యూజర్ల సంఖ్యాపరంగా తాము ట్విటర్‌ను అధిగమించామని రాధాకృష్ణ చెప్పారు.

2020 మార్చిలో ప్రారంభమైన కూ ప్రస్తుతం దేశీయంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ సహా 10 భాషల్లో కూ అందుబాటులో ఉంది.  నైజీరియాలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, విదేశాల్లో విస్తరణలో భాగంగా ఇండొనేసియా మొదలైన దేశాలను పరిశీలిస్తున్నామని రాధాకృష్ణ చెప్పారు. ఇప్పటికే 45 మిలియన్‌ డాలర్లు సమీకరించామని, ఈ ఏడాది మరిన్ని నిధుల సమీకరణ ప్రణాళికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నకిలీ ఖాతాలు, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్ట్‌ల విషయంలో తగు రీతిలో వ్యవహరించేందుకు సలహా మండలిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 5–11 మంది సభ్యులు ఇందులో ఉంటారని, ఏడాది వ్యవధిలోగా దీన్ని ఏర్పాటు చేయగలమని ఆయన వివరించారు.   

చదవండి: ట్విటర్‌ డీల్‌కు మస్క్‌ బ్రేకులు

మరిన్ని వార్తలు