కోటక్‌ మహీంద్రా లాభం 9 శాతం డౌన్‌

28 Jul, 2020 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంకు స్టాండలోన్‌ నికర లాభం (బ్యాంకు వరకే) జూన్‌ త్రైమాసికంలో 8.5 శాతం తగ్గి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,360 కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి త్రైమాసికం లాభం రూ.1,266 కోట్లతో పోల్చి చూస్తే పెద్దగా మార్పులేదు. ఆదాయం సైతం రూ.7,945 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు తగ్గింది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు గణనీయంగా పెరిగి రూ.962 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.316 కోట్లతో పోలిస్తే 3 రెట్లు పెరిగాయి. 

ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో కేటాయింపులు రూ.1,047 కోట్లతో పోల్చుకుంటే జూన్‌ క్వార్టర్‌లో తగ్గాయి.  స్థూల ఎన్‌పీఏలు 2.19% నుంచి 2.70%కి (రూ.5,619 కోట్లు) చేరాయి. నికర ఎన్‌పీఏలు  0.73% నుంచి 0.87%కి (రూ.1,777 కోట్లు) చేరాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 4.1% తగ్గి రూ.1,853 కోట్లుగా ఉంటే, ఆదాయం రూ.12,129 కోట్ల నుంచి రూ.12,323 కోట్లకు ఎగసింది. ఆర్థిక మందగమనం కారణంగా రుణ ఎగవేతలు పెరగొచ్చని, దీంతో రానున్న కాలంలో గ్రూపు స్థాయిలో కేటాయింపులు పెరుగుతాయని కోటక్‌ బ్యాంకు పేర్కొంది.

మరిన్ని వార్తలు