ఇండస్‌ఇండ్‌పై కొటక్‌ మహీంద్రా కన్ను?!

26 Oct, 2020 10:19 IST|Sakshi

ఇండస్‌ఇండ్‌ టేకొవర్‌కు కొటక్‌ మహీంద్రా కసరత్తు!

షేర్ల మార్పిడి ద్వారా డీల్‌ కుదుర్చుకునే అవకాశం?

సంయుక్త బ్యాంక్‌లో హిందుజా గ్రూప్‌నకు వాటా!

మార్కెట్‌ వర్గాల అంచనాలు- పుకార్లేనన్న ఇండస్‌ఇండ్‌

హిందుజా గ్రూప్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌పై ప్రయవేట్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ దృష్టి సారించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్‌ స్టాక్‌ డీల్‌(షేర్ల మార్పిడి) ద్వారా ఒప్పందం కుదుర్చుకునే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సంయుక్త సంస్థలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు హిందుజా గ్రూప్‌ కొంతమేర వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై వ్యాఖ్యలు చేయబోమంటూ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రతినిధి స్పందించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇక మరోపక్క.. ఇవి వట్టి పుకార్లు మాత్రమేనని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సీఈవో సుమంత్‌ కథప్లియా కొట్టిపారేశారు. బ్యాంక్‌ యాజమాన్యం ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ వార్తలు నిరాధారమని వివరించారు.

డీల్‌ జరిగితే..
ఇటీవల ఆస్తుల(రుణ) నాణ్యతపై ఆందోళనలతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు డీలాపడుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండస్‌ఇండ్‌ షేరు 64 శాతం పతనమైంది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువలో 60 శాతం కోత పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఒకవేళ ఇండస్‌ఇండ్‌ను కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ టేకోవర్‌ చేస్తే.. సంయుక్త సంస్థ ప్రయివేట్‌ రంగంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఆవిర్భవించే వీలున్నట్లు వివరించారు. బ్యాంక్‌ ఆస్తులు 83 శాతం పెరిగే అవకాశమున్నట్లు తెలియజేశారు. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఇంతక్రితం 2014లో ఐఎన్‌జీ గ్రూప్‌ను 2 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇండస్‌ఇండ్‌ ప్రమోటర్లు హిందుజా గ్రూప్‌తో​ కొటక్‌  మహీంద్రా గ్రూప్‌ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. 11.2 బిలియన్‌ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్‌లోని నలుగురు సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్‌ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు భావిస్తున్నాయి. హిందుజా సోదరులు ఇండస్‌ఇండ్‌లో వాటా పెంచుకునేందుకు చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ తిరస్కరించినట్లు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

షేర్ల తీరిలా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు యథాతథంగా రూ. 1,382 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,399 వద్ద గరిష్టాన్ని, రూ. 1,372 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 2.4 శాతం జంప్‌చేసి రూ. 623 వద్ద కదులుతోంది. తొలుత గరిష్టంగా రూ. 633ను అధిగమించగా.. ఒక దశలో రూ. 617 వద్ద కనిష్టాన్ని చేరింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు