బెంగళూరు స్టార్టప్‌ పంచాయతీ.. ఛాలెంజ్‌ స్వీకరించిన కేటీఆర్‌ !

4 Apr, 2022 16:16 IST|Sakshi

దినదినాభివృద్ధి చెందుతున్న ఓ స్టార్టప్‌ కంపెనీకి వచ్చిన ఇబ్బందులు  ఇద్దరు రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్‌కి దారి తీశాయి. వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూనే ఆసక్తికర పోటీకి తెరలేపారు.

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా పేరొందిన బెంగళూరు సిటీ అనేక స్టార్టప్‌ కంపెనీలకు పుట్టిల్లు కూడా. హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ఖాతాబుక్‌ స్టార్టప్‌లను ఇక్కడే ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా చొచ్చుకుపోతున్నారు ఆ కంపెనీ సీఈవో రవీశ్‌ నరేశ్‌. అయితే ఇటీవల బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయల కొరతపై ఆయన ట్విట్టర్‌ వేదికగా గళం విప్పారు.

బెంగళూరులోని కోరమంగళ ఏరియాలో ఉన్న స్టార్టప్స్‌ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను పన్నులుగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. ఐనప్పటికీ ఈ స్టార్లప్‌లు ఉన్న ఏరియా అంతా గతుకుల రోడ్లు, కరెంటు కోతలు, అరకొర నీటి సరఫరా వంటి సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నాయి. బెంగళూరు కంటే రూరల్‌ ఏరియాల్లోనే సౌకర్యాలు బాగున్నాయంటూ ట్వీట్‌ చేశాడు. రవీశ్‌ నరేశ్‌ ట్వీట్‌కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. మీరు వెంటనే హైదరాబాద్‌కి రండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ తెలిపారు. 

కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అయితే కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ శివకుమార్‌ కూడా ఈ జాబితాలో చేరారు. మై ఫ్రెండ్‌ కేటీఆర్‌.. నీ ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నాను. 2023 చివరికల్లా కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. అలా జరిగిన మరుక్షణమే బెంగళూరు సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ శివకుమార్‌ బదులిచ్చారు.

శివకుమార్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ కూడా అదే స్థాయిలో స్పందించారు.. శివకుమార్‌ అన్న కర్నాటకలో రాజకీయాలు ఎలా ఉన్నాయో నాకు సరిగా తెలియదు. ఎవరో గెలుస్తారో చెప్పలేం. కానీ మీ ఛాలెంజ్‌ని నేను స్వీకరిస్తున్నాను. బెంగళూరు, హైదరాబాద్‌ సిటీలో అభివృద్ధిలో పోటీ పడాలి. మన యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాలి. మన ఫోకస్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి అంశాలపై ఉండాలి కానీ హలాల్‌, హిజాబ్‌ లాంటి విషయాలపై కాదంటూ కేటీఆర్‌ తెలిపారు.

చదవండి: ఇండియన్లంటే అంతే.. ఎక్కడా తగ్గేదేలే అంటున్న ఆనంద్‌ మహీంద్రా!

మరిన్ని వార్తలు