అగ్గది తెలంగాణ అంటే అట్లుంటది.. దేశ ప్రగతి కంటే మిన్నగా..

1 Jun, 2022 12:50 IST|Sakshi

కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటూ తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుంది. గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఏకంగా 26.14 శాతం వృద్ధిని కనబరిచింది. ఐటీలో తెలంగాణ సాధించిన వృద్ధిని వార్షిక నివేదిక ద్వారా మంత్రి కేటీఆర్‌ స్వయంగా వెల్లడించారు.

జాతీయ సగటు కంటే ఎక్కువ
హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో జాతీయ సగటు 17.2 శాతం ఉండగా తెలంగాణ 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు కంటే ఏకంగా 9 శాతం అధిక వృద్ధి సాధించినట్టు మంత్రి వివరించారు. 

తెలంగాణ వచ్చాక
2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే ఒక్క హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయన్నారను. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉందన్నారను. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. 

త్వరలో
ఐటీ సెక్టార్‌లతో తెలంగాణ మరెంతో ప్రగతి సాధించనుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. హైదరాబాద్‌లో స్టార్టప్‌ కల్చర్‌ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా 2022 జూన్‌ 20న టీ హబ్‌ సెకండ్‌ ఫేజ్‌ను ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే అవకాశం ఉందని కేటీఆర్‌ వెల్లడించారు.
 

చదవండి: స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్‌: కేటీఆర్‌

మరిన్ని వార్తలు