క్యుబోటా చేతికి ఎస్కార్ట్స్‌

19 Nov, 2021 06:11 IST|Sakshi

5.9% అదనపు వాటా కొనుగోలు

రూ. 1,873 కోట్ల తాజా పెట్టుబడులు

మరో 26% వాటాకు ఓపెన్‌ ఆఫర్‌

44.8%కి చేరనున్న క్యుబోటా వాటా

రూ. 10,000 కోట్లవరకూ పెట్టుబడి

న్యూఢిల్లీ: వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌లో జపనీస్‌ భాగస్వామి క్యుబోటా కార్పొరేషన్‌ మెజారిటీ వాటాను పొందనుంది. ఇందుకు రూ. 10,000 కోట్లవరకూ పెట్టుబడులను వెచ్చించనుంది. ఇందకు రెండు సంస్థలూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగా తొలుత ఎస్కార్ట్స్‌లో క్యుబోటా దాదాపు రూ. 1,873 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. తద్వారా 5.9 శాతం అదనపు వాటాను పొందనుంది. దీంతో క్యుబోటా కార్ప్‌ వాటా 14.99 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం 9.09 శాతం వాటాను కలిగి ఉంది. ఫలితంగా ఎస్కార్ట్స్‌కు సంయుక్త ప్రమోటర్‌గా క్యుబోటా ఆవిర్భవించనుంది.

తాజా ఒప్పందం ప్రకారం క్యుబోటాకు ఫ్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 93.64 లక్షల షేర్లను ఎస్కార్ట్స్‌ జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 2,000 ధరలో వీటి జారీ ద్వారా రూ. 1,873 కోట్లు సమకూర్చుకోనుంది. ఆపై ఎస్కార్ట్స్‌ వాటాదారులకు క్యుబోటా ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెబీ నిబంధనల్లో భాగంగా పబ్లిక్‌ నుంచి 26% వాటా కొనుగోలును చేపట్టవలసి ఉంటుంది. ఇందుకు షేరుకి రూ. 2,000 ధరలో రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. దీంతో ఎస్కార్ట్స్‌లో 44.80% వాటాను క్యుబోటా సొంతం చేసుకోనుంది. తదుపరి ఎస్కార్ట్స్‌ బెనిఫిట్‌ అండ్‌ వెల్‌ఫేర్‌ ట్రస్ట్‌కు ఎస్కార్ట్స్‌లోగల వాటాను రద్దు చేయనుంది. వెరసి క్యుబోటా వాటా 53%కి బలపడనుంది.  

పేరు మార్పు: కంపెనీ పేరును ఎస్కార్ట్స్‌ క్యుబోటా లిమిటెడ్‌గా సవరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఎస్కార్ట్స్‌ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీయంగా గల భాగస్వామ్య అనుబంధ సంస్థలను ఎస్కార్ట్స్‌లో విలీనం చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో క్యుబోటా వాటా 54–55 శాతానికి చేరనుంది. కాగా.. ఎస్కార్ట్స్‌లో 11.6 శాతం వాటాను కలిగిన ప్రస్తుత ప్రమోటర్‌ నందా కుటుంబం ఎలాంటి వాటానూ విక్రయించడంలేదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం నందా కుటుంబం, ఎస్కార్ట్స్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌లకు సంయుక్తంగా 36.59 శాతం వాటా ఉంది.

తాజా వార్తలతో ఎస్కార్ట్స్‌ షేరు దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,803 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు