వీఐలో వాటా అప్పగించేందుకు రెడీ

3 Aug, 2021 00:22 IST|Sakshi

కుమార మంగళం బిర్లా తాజా ఆఫర్‌

కంపెనీలో బిర్లాకు 27 శాతం వాటా

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా(వీఐ) లిమిటెడ్‌లో తమకున్న వాటాను ప్రభుత్వం లేదా ఏ ఇతర సంస్థకైనా అప్పగించేందుకు సంసిద్ధమంటూ కేఎం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగింపునకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మేలు చేయగలదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ జూన్‌ 7న కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గాబాకు బిర్లా లేఖ రాశారు. వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం వీఐఎల్‌కున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) బకాయిలు(లయబిలిటీ) రూ. 58,254 కోట్లుకాగా.. వీటిలో రూ. 7,854 కోట్లకుపైగా చెల్లించింది.

సుప్రీం నో: ఏజీఆర్‌ మదింపులో దిద్దుబాట్లకోసం భారతీ ఎయిర్‌టెల్‌సహా వీఐఎల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. కాగా.. ఏజీఆర్‌ బకాయిలపై స్పష్టత లోపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులకు ముందుకురావడంలేదని లేఖలో బిర్లా పేర్కొన్నారు. స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై అవసరమైనంత మారటోరియం విధింపు, ప్రధానంగా సర్వీసు వ్యయాలకు మించిన ఫ్లోర్‌ ధరల విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారీ రుణ భారం: రూ. 25,000 కోట్లు సమీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో బోర్డు వీఐఎల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కంపెనీ నిధుల సమీకరణ చేపట్టలేకపోవడం గమనార్హం! లీజ్‌ లయబిలిటీలను మినహాయిస్తే కంపెనీకి స్థూలంగా రూ. 1,80,310 కోట్ల మేర రుణభారముంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్‌ చెల్లింపులు రూ. 96,270 కోట్లుకాగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు రూ. 23,080 కోట్లుగా నమోదయ్యాయి. 

>
మరిన్ని వార్తలు