కాల్స్‌, మెసేజ్‌ల్లో కేవైసీ వివరాలు అడిగితే? తప్పదు.. ఇలా కన్ఫర్మ్‌ చేసుకోవాల్సిందే!

31 Jul, 2021 12:28 IST|Sakshi

KYC Frauds Alert: ఓవైపు బ్యాంకులు.. మరోవైపు టెలికామ్‌ ఆపరేటర్లు ‘కేవైసీ అప్‌డేట్‌’ పేరిట కస్టమర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఓసారి ‘అప్‌డేట్‌ తప్పనిసరి’ అంటున్నాయి. మరోసారి ‘మోసాలు జరుగుతున్నాయి..జాగ్రత్త!’ అంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో గందరగోళంలో పడిపోయి కస్టమర్‌ ఆ కన్ఫ్యూజింగ్‌ స్టేజ్‌లోనే మోసగాళ్ల బారినపడుతున్నారు. కాబట్టి, అయోమయానికి గురికాకుండా.. జాగ్రత్తగా కన్ఫర్మ్‌ చేసుకోవాలని సైబర్‌ నిపుణులు  సూచిస్తున్నారు.  

సాక్షి, వెబ్‌డెస్క్‌: నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) స్కామ్‌ ద్వారా వ్యక్తిగత డేటాను స్కామర్లు తస్కరించే అవకాశం ఉంటుందని తన 27 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను హెచ్చరించింది వొడాఫోన్‌ ఐడియా(Vi). ఇక వీఐ కంటే ముందు ఎయిర్‌టెల్‌ కూడా ఇలాంటి ఓ హెచ్చరికే జారీ చేసింది. మరోవైపు ఎస్‌బీఐ లాంటి బడా బ్యాంకులు కూడా అదే తోవలో పయనిస్తూ కేవైసీ మోసాలపై కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. కేవైసీ అప్‌డేట్‌ పేరుతో వ్యక్తిగత వివరాలను, సంబంధిత డాక్యుమెంట్ల సమాచారాన్ని సేకరించి.. కొన్నేళ్లుగా పక్కా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ఈ మధ్య అలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండడం కస్టమర్లకు అవసరం కూడా.
   
హలో, కస్టమర్‌ సర్వీస్‌ నుంచి.. 
కేవైసీ మోసాల కోసం హై ఫ్రొఫైల్‌ టెక్నికల్‌నేం మోసగాళ్లు ఉపయోగించడం లేదు. సింపుల్‌గా.. టెలికామ్‌ ఆపరేటర్ల కంపెనీలు, బ్యాంకుల పేరిట మెసేజ్‌లు పంపుతున్నారు. కస్టమర్‌ సర్వీస్‌, ఆథరైజేషన్‌ వింగ్‌ నుంచి ప్రతినిధులమంటూ ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. తక్షణమే కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని.. లేకుంటే బ్యాంక్‌ సేవలు నిలిపివేస్తామని, సిమ్‌ బ్లాక్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పైగా పరిష్కారం ఇదేనంటూ కొన్ని మెసేజ్‌లు, లింకులు పంపుతున్నారు. లేదంటే ఫలానా టోల్‌ఫ్రీ(ఫ్రాడ్‌) నెంబర్‌కి ఫోన్‌ చేయమని.. వాళ్లిచ్చే సూచనలు ఫాలో అవ్వమని అదీ కుదరదంటే ఫలానా మెసేజ్‌లకు రిప్లైలు ఇవ్వమని యూజర్లను, సబ్‌స్క్రయిబర్లను కోరుతున్నారు. పని తేలికగా అయిపోతుంది కదా అని వివరాలు ఇచ్చేస్తున్నారు చాలామంది. ఇక చదువుకున్న వాళ్లను, కొద్దిగా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లను బోల్తా కొట్టించడానికి ‘యాప్‌’ ఇన్‌స్టాల్‌ చేసుకుని.. అందులో వివరాలు నింపమని అడుగుతున్నారు. ఓవరాల్‌గా.. కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో కీలక సమాచారం లాగేసి కస్టమర్లను  కోలుకోలేని దెబ్బతీస్తున్నారు.
 

లైట్‌ తీస్కోవద్దు
KYC మోసాల తరుణంలో టెలికామ్‌ కంపెనీలు, బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. తమ తరపున అలాంటి సందేశాలు, కాల్స్‌ రావని.. ఒకవేళ వచ్చినా అప్రమత్తం చేస్తాయే తప్పా వ్యక్తిగత వివరాలను అడగవనే విషయాన్ని గుర్తించాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. అంతేకాదు థర్డ్‌ పార్టీ యాప్‌(సంబంధం లేని యాప్‌లు) ఇన్‌స్టాల్‌ ఎట్టిపరిస్థితుల్లో చేసుకోకూడదని హెచ్చరిస్తున్నాయి కూడా. అయితే కేవైసీ అప్‌డేట్‌ తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో ఏది సిసలో.. ఏది నకిలీనో గ్రహించలేక కస్టమర్లు నష్టపోతున్నారు. అవగాహన లేకపోవడమో లేదంటే నిర్లక్క్ష్య ధోరణి వల్లనో ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాలను లైట్‌గా తీసుకునే కస్టమర్లే ఎక్కువగా ఉంటున్నారు మన దేశంలో. ఇది సాకుగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. (ఆన్‌లైన్‌ మోసాల బారినపడుతున్న దేశాల్లో టాప్‌ ప్లేస్‌ మనదే). ఫిర్యాదులు చేయడం, సంబంధిత విభాగాలను సంప్రదించడం వల్లే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టపడేదని గుర్తించాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా డీల్‌ చేయండి
ఈ-మెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ నెంబర్స్‌, అడ్రస్‌, ఆధార్‌ డిటెయిల్స్‌, ఫొటో.. ఏది పంపినా, ఏ వివరాలు చెప్పిన కేవైసీ మోసాల బారిన పడే అవకాశం కచ్ఛితంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టే ప్రయత్నం కాదు.. జరుగుతున్నది చెప్పడమే అంటున్నారు. ఈ మధ్య కొన్ని బ్యాంకింగ్‌ సర్వీసులు, టెలికామ్‌ సంబంధిత వ్యవహారాలు ఫోన్లు, యాప్‌లలోనే నడుస్తున్నాయి. వాట్సాప్‌, మెయిల్స్‌ ద్వారా డాక్యుమెంటేషన్‌ నిమిషాల్లో నడిచిపోతోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకుల లోన్లు, హెల్త్ ఇన్సూరెన్‌ల విషయంలో ఇది ఎక్కువగా నడుస్తోంది. కాబట్టి, అవతల ఉంది నిజమైన ఎంప్లాయేనా అని నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లాలి. ఇక టెలికామ్‌ కంపెనీల నుంచి వచ్చే మెసేజ్‌లు పర్టిక్యులర్‌గా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. వోడాఫోన్‌ ఐడియా నుంచి వచ్చే మెసేజ్‌లు ViCARE అని ఉంటాయి. ఇందులోనూ స్పెల్లింగ్‌ మిస్టేక్‌తో మోసాలకు పాల్పడే ఛాన్స్‌ ఉంది కాబట్టి.. మెసేజ్‌ను నిశితంగా పరిశీలించాలి. అంతేతప్ప కంగారుపడిపోయి వివరాలను అవతలి వాళ్లకు రివీల్‌ చేయకూడదు.

మరోవైపు బ్యాంకింగ్‌ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కేవైసీ అప్‌డేట్‌ సందేశాలు, కాల్స్‌ వస్తే.. స్వయంగా బ్యాంక్‌కు వెళ్లి కనుక్కోవాలి. అవసరమైతేనే డాక్యుమెంట్లు సమర్పించాలి. అంతేతప్ప కాల్స్‌, మెసేజ్‌లకు బదులివ్వకూడదు.  సిమ్‌ కేవైసీ వ్యవహారాల్లోనూ సంబంధిత స్టోర్లకు వెళ్లి కనుక్కోవాలి. ఇంట్లో చదువుకోని వాళ్లకు ఇలాంటి కాల్స్‌ వస్తే ఎలా స్పందించాలో తెలియజెప్పాలి. కస్టమర్‌ సెంటర్‌కు కాల్‌ చేయడమో లేదంటే బ్యాంకుకు వెళ్లి కనుక్కోవడమో చేయాలని చెప్పాలి. అంతేతప్ప భయపడి వివరాలు చెప్పకూడదని వివరించాలి. బ్యాంకింగ్‌ అయినా.. సెల్యూలార్‌ అయినా అధికారిక టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్‌ చేసి ధృవీకరించుకోవడమో లేదంటే స్వయంగా వెళ్లి కనుక్కోవడమో చేయాలి. వీలైతే ఫిర్యాదులు చేయాలి. నిర్లక్క్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.  

వీఐపీ నెంబర్‌ స్కామ్‌
ఈ-కేవైసీ మోసాలు మాత్రమే కాదు.. ఈమధ్య వీఐపీ నెంబర్‌ స్కామ్‌ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. భారీ డిస్కౌంట్‌తో వీఐపీ నెంబర్లు ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నారు కొందరు. అయితే టోకెన్‌ కోసం ప్రీ పేమెంట్‌ చేయాలని కోరుతున్నారు. డిజిటల్‌​ పే అయినా ఫర్వాలేదని బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే సిమ్‌ జారీల విషయంలో ‘థర్డ్‌ పార్టీ’లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని హెచ్చరిస్తోంది సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీవోఏఐ).

మరిన్ని వార్తలు